
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్వరుసగా ఐదోసారి డుమ్మా కొట్టారు. ప్రగతి భవన్‌లోనే ఉండి కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లలేదు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే వందే భారత్రైలు ప్రారంభోత్సవం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మోడ్రనైజేషన్, బీబీ నగర్ఎయిమ్స్లో అదనపు భవనాల నిర్మాణాలు, రూ. 7 వేల కోట్లకు పైగా నిధులతో చేపడుతున్న నేషనల్ హైవేస్ నిర్మాణానికి భూమిపూజ చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. శనివారం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి చెన్నై వెళ్లిన ప్రధానికి.. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం స్వాగతం పలికి అక్కడి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.
నిరుడు రాష్ట్రానికి ప్రధాని మోడీ నాలుగుసార్లు వచ్చినా ఎప్పుడూ కేసీఆర్ వెళ్లి ఆహ్వానం పలుకలేదు. 2022 ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లకు కోసం రెండు వారాల ముందే ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్ తీరా విగ్రహావిష్కరణ టైం వచ్చేసరికి జీయర్‌తో విభేదించారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వంపైనా కేసీఆర్ విమర్శలు చేస్తూ వచ్చారు. రాజకీయ విభేదాలతోనే ప్రధానికి కేసీఆర్ఆహ్వానం పలుకలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. మే 26న ఐఎస్బీ కాన్వొకేషన్‌కు మోడీ చీఫ్ గెస్ట్‌గా వస్తే కేసీఆర్జేడీఎస్నేతలతో చర్చలు జరిపేందుకు బెంగళూరుకు వెళ్లారు. హైదరాబాద్ టూర్అనంతరం మోడీ చెన్నై పర్యటనకు వెళ్తే ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలికారు.
జులై ఒకటి నుంచి మూడో తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వచ్చారు. రెండు, మూడో తేదీల్లో ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పుడూ ఆయనను కేసీఆర్ ఆహ్వానించలేదు. అదే టైంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా పరిచయం పేరుతో అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించి, అదే వేదికపై మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నవంబర్12న రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభోత్సవానికి మోడీ రాష్ట్రానికి వచ్చారు. పలు నేషనల్ హైవేస్‌కు ఆ సమయంలో శంకుస్థాపన చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే ఉండి కూడా ప్రధానిని రిసీవ్ చేసుకోలేదు. అదే రోజు సాయంత్రం ప్రధాని వైజాగ్ వెళ్లారు. ఏపీ సీఎం జగన్ ప్రధానికి ఆహ్వానం పలికి తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు.