- తుపాకీతో బెదిరించి స్కూల్ బేస్మెంట్లో 300 మంది బందీ
- ఊపిరాడక 18 మంది మృతి
యహిడ్నే: రోజులు గడిచే కొద్దీ రష్యా సైనికుల దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అలాంటి ఘటనే ఉక్రెయిన్‌లోని యహిడ్నే అనే ఊర్లో ఒకటి జరిగింది. 300 మందికి పైగా జనాన్ని తుపాకులతో బెదిరించి బలవంతంగా ఓ స్కూల్లోని అండర్‌గ్రౌండ్ బేస్మెంట్లో రష్యా సైనికులు బంధించారు. దాదాపు నెలరోజులు ఆ ఇరుకు బేస్మెంట్లోనే ఉండడంతో ఊపిరాడక కొందరు చనిపోయారు. ఇప్పుడు రష్యా సైనికులు ఆ ఊరి నుంచి వెళ్లిపోవడంతో ఆ భయానక ఘటనకు సంబంధించిన వివరాలను జనాలు వివరించారు. వండుకోవడానికి లేదా టాయిలెట్‌కు తప్ప తమను బయటకు రానిచ్చేటోళ్లు కాదని వాలెంటీనా సరోయాన్ అనే మహిళ ఆవేదన వ్యక్తంచేసింది. ఇరుకు స్థలంలో అందరినీ కుక్కేయడంతో ఒక్కొక్కరుగా 18 మంది చనిపోయారని, వారిని ఖననం చేసేందుకు మాత్రమే తమను బయటకు అనుమతించే వారని చెప్పుకొచ్చింది. రష్యా సైనికులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని స్విట్లానా బగూటా అనే మరో మహిళ తెలిపింది. రష్యా జాతీయ గీతాన్ని పాడినోళ్లను ఇంటికి పోయేందుకు అనుమతించేవారని, పాడనివాళ్లను అక్కడే ఉంచారని జూలియా సూరీపాక్ అనే మహిళ తెలిపింది. ఆ నరకంలో ఎలాగోలా ప్రాణాలను నిలబెట్టుకున్న వాళ్లు.. చనిపోయిన వారి పేర్లను బేస్మెంట్ గోడల మీద రాశారు.
మీవోడిని తీస్కొని మావోళ్లను పంపండి..
రష్యా ప్రతిపక్ష నేత విక్టర్ మెద్వెద్‌చుక్‌ను మంగళవారం ఉక్రెయిన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మెద్వెద్చుక్కు బేడీలు వేసి కూర్చోబెట్టిన ఫొటోను ఉక్రెయిన్ అధికారి ఒకరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. మెద్వెద్‌చుక్‌ను విడిచిపెట్టాలంటే యుద్ధంలో బందీలుగా పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులు, ప్రజలను తమకు అప్పగించాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. రష్యా అధికారులు మాత్రం ఆ ఫొటోను నమ్మలేమని, ఎడిట్ చేసి ఉండొచ్చన్నారు.
