హైదరాబాదీలు అత్యవసరం అయితేనే బయటకు రండి : ట్రాఫిక్ జామ్, వర్షం, ఆరెంజ్ అలర్ట్..

హైదరాబాదీలు అత్యవసరం అయితేనే బయటకు రండి : ట్రాఫిక్ జామ్, వర్షం, ఆరెంజ్ అలర్ట్..

బాబోయ్ వర్షం. అమ్మ బాబోయ్ అతి భారీ వర్షం.  మొన్నటి వరకు ఎండలు, పొడి వాతావరణంతో జాడ లేని వాన...ఒక్కసారిగా  హైదరాబాద్ పై పడింది. తన కసినంతా తీర్చుకుంటోంది.  సెప్టెంబర్ 4వ తేదీ తెల్లవారుజాము నుంచి వాన బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతోంది. 

ఈ ప్రాంతాల్లో భారీ వాన..

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, మెహదీపట్నం, నాంపల్లిలో వాన పడుతోంది. కూకట్ పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లిలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అమీర్‌పేట, మైత్రీవనం,  సికింద్రాబాద్  కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ముసురు పట్టింది. సుచిత్ర,కొంపల్లి,దూలపల్లి, దుందిగల్,గండిమైసమ్మ, మల్లంపేట్,బౌరంపేట్, బాహుదూర్ పల్లి, సురారం,జీడిమెట్ల,షాపూర్ నగర్,చింతల్,గాజులరామారం, జగద్గిరిగుట్టలో ఎకధాటిగా వాన పడుతోంది.  అటు పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ లో ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లో వర్షం దంచికొడుతోంది. అటు  నార్సింగ్‌ మున్సిపాలిటీ బాలాజీనగర్‌ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  

ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

భారీ వర్షం..రోడ్లపై వరదలతో నగర వ్యాప్తంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సెప్టెంబర్ 3వ తేదీ ఆదివారం అందరికి సెలవులు కావడంతో  ఎంజాయ్ చేసిన ఉద్యోగులు..సెప్టెంబర్ 4వ తేదీ సోమవారం తిరిగి ఆఫీసుల బాట పట్టారు. అయితే వానతో ఆఫీసులకు వెళ్లే వాహనదారులంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యమైన ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కూకట్ పల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే రూట్ అయితే స్ట్రక్ అయిపోయింది. 

5 నిమిషాల జర్నీకి అరగంట..

కూకట్ పల్లి నుంచి అమీర్ పేట, ఖైరతాబాద్ మీదుగా కోఠి వెళ్లే రోడ్ లో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. అమీర్ పేట నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంతో పాటు..పంజాగుట్ట నుంచి కొండాపూర్ రోడ్డు, సికింద్రాబాద్ నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్ మీదుగా హైటెక్ సిటీ వెళ్లే రోడ్ మొత్తం వాహనాలతో బ్లాక్ అయింది.  సోమవారం (సెప్టెంబర్ 4) అన్ని కార్యాలయాలు తెరచుకోవడంతో ఒక్కసారిగా వాహనదారులంతా రోడ్లపైకి వచ్చారు. దీనికి తోడు వాన. ఇంకేమంది వాహనాలన్నీ ఉన్న చోటే ఉండిపోయే పరిస్థితి నెలకొంది. 5 నిమిషాలు, 10 నిమిషాల జర్నీకి ఏకంగా అరగంట, గంటకు పైగా సమయం పడుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఆరెంజ్ అలర్ట్..

భారీ వర్షాల నేపథ్యంలో  హైదరాబాద్కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌కు సంబంధించి, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి మొత్తం ఆరు జోన్‌లలో  సెప్టెంబర్ 4వ తేదీ భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

జీహెచ్ఎంసీ వార్నింగ్..

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ వార్నింగ్ ఇచ్చింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని..లేదంటే ఇంట్లోనే ఉండాలని సూచించింది. సెప్టెంబర్ 4వ తేదీన జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వాన బీభత్సం సృష్టించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసింది. తమ కాలనీల్లో సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 040- 21111111, 9000113667ను ఏర్పాటు చేసింది. అలాగే డిజాస్టర్ బృందాలు అప్రమత్తంగా ఉండాలంటూ  ఆదేశాలు జారీ చేసింది.