- ఈ ఏడాదిలో రూ.1.8 లక్షల కోట్ల ఉపసంహరణ
- కొరియా, తైవాన్ మార్కెట్లపై ఆసక్తి
- యుద్ధం కొనసాగడమే ముఖ్య కారణం
న్యూఢిల్లీ: భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడిదారులు దూరం జరుగుతున్నారు. షేర్ల అమ్మకాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈనెల మొదటి పది రోజుల్లోనే రూ.48,213 కోట్లు వెనక్కి తీసుకున్నారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, నష్టాలు కొనసాగుతూనే ఉండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
గతేడాది మార్చిలో రూ.1.17 లక్షల కోట్ల రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. అంతకుముందు నెలలో మాత్రం రూ.22,615 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2026లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు. ఎన్ఎస్డీఎల్ లెక్కల ప్రకారం ఏప్రిల్ 10 నాటికి విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్లో రూ.48,213 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఎఫ్‌పీఐలపై ఒత్తిడి పెంచుతున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మొదలయ్యాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ప్రతినిధి హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. ఇంధన సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే భయం, రూపాయి విలువ క్షీణత.. ఎఫ్‌పీఐలను అమ్మకాల వైపు నడిపిస్తున్నాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రతినిధి వీకే విజయకుమార్ పేర్కొన్నారు.
దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లు ప్రస్తుతం ఎఫ్ఐఐలకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అమ్మకాల జోరు తగ్గలేదు. హోర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, రూపాయి విలువ, నాలుగో క్వార్టర్ ఫలితాల ఆధారంగా పెట్టుబడుల రాక ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
రూ.4.13 లక్షల కోట్లు పెరిగిన టాప్ –10 కంపెనీల మార్కెట్ క్యాప్
దేశంలోని టాప్ 10 కంపెనీలలో ఎనిమిది సంస్థల మార్కెట్ విలువ గడిచిన వారంలో రూ.4.13 లక్షల కోట్లు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ భారీగా లాభాలను ఆర్జించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 4,230.7 పాయింట్లు పెరిగి 5.77 శాతం లాభపడగా, నిఫ్టీ 1,337.5 పాయింట్లు పెరిగి 5.88 శాతం వృద్ధి సాధించింది. ముడి చమురు ధరలు 100 డాలర్ల దిగువకు రావడం మార్కెట్లు పుంజుకోవడానికి కారణమైంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ.91,282.67 కోట్లు పెరిగి రూ.12,47,478.57 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.76,036.36 కోట్లు పెరిగి రూ.9,46,741.85 కోట్లుగా నమోదైంది. బజాజ్ ఫైనాన్స్ ఎల్ అండ్ టీ, ఎయిర్‌టెల్, ఎస్బీఐ, టీసీఎస్, హిందుస్థాన్ యూనిలీవర్ కూడా లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ మాత్రం నష్టపోయాయి. రిలయన్స్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా మొదటిస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.18.27 లక్షల కోట్లకు చేరింది.
