
కౌడిపల్లి, వెలుగు: అటవీ భూమిలో ఇల్లు కట్టారంటూ మెదక్జిల్లాలోని ఫారెస్ట్ఆఫీసర్లు సోమవారం ఓ ఇంటిని కూల్చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న అనుబంధ గ్రామమైన అచ్చన్నపల్లి తండాకు చెందిన బోడ రాజేందర్‌కు ఇల్లు లేదు. ఎనిమిదేండ్ల కింద తండాలోని ఖాళీ జాగాలో పూరి గుడిసె వేసుకున్నాడు. తర్వాత కూలి పనులకు వెళ్తూ వచ్చిన పైసలతోపాటు, కొంత అప్పు చేసి రెండేండ్ల కింద గుడిసె తొలగించి రేకుల షెడ్డు వేసుకున్నాడు.
అప్పటి నుంచి గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కడుతున్నాడు. అంతకు ముందు నుంచే నల్లా బిల్లు చెల్లిస్తున్నాడు. అయితే రాజేందర్ఇల్లు ఫారెస్ట్ ల్యాండ్‌లో ఉందని, సోమవారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి జేసీబీతో ఇంటిని కూల్చేశారు. వారం కింద రాజేందర్ డీఎఫ్ఓను కలవగా, తమకు ఇల్లు కూలగొట్టే ఉద్దేశం లేదని చెప్పారని బాధితుడు రాజేందర్ వాపోయాడు. అయితే కౌడిపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజమణి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజమణి వివరణ కోరగా తండాకు చెందిన బోడ రాజేందర్ కు గతంలో పూరి గుడిసె ఉండేదని, అటవీ ప్రాంతంలో ఉందని రెండు సార్లు తొలగించామన్నారు. అవేం పట్టించుకోకుండా అందులోనే బేస్మెంట్వేసి, రేకుల షెడ్డు నిర్మించాడని చెప్పారు. నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పారు. 15 రోజులు గడువు ఇచ్చామని తొలగించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.