కేసీఆర్ కనుసైగ చేస్తే.. కాంగ్రెస్ మాడి మసైతది : ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 

కేసీఆర్ కనుసైగ చేస్తే.. కాంగ్రెస్ మాడి మసైతది : ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 
  • దాడులకు ప్రతిదాడులు చేస్తం
  • బీఆర్ఎస్ సైనికులం 60 లక్షల మంది ఉన్నామని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి విచ్చలవిడిగా చేయిస్తున్న దాడులకు ప్రతిదాడులు చేస్తామని ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​నేత ఆశన్నగారి జీవన్​ రెడ్డి బెదిరింపులకు దిగారు. కేసీఆర్​ది కంచెల పాలనంటూ దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు రేవంత్​ నేతృత్వంలో ముంచే పాలన వచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్​ పదేండ్ల పాలనలో తాము వాళ్లలాగే చేస్తే కాంగ్రెస్​ బతికి బట్టకట్టేదా అంటూ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణభవన్​లో  జీవన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్​ది 60 లక్షల గులాబీ సైన్యమని, కేసీఆర్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ మాడి మసికాక తప్పదని హెచ్చరించారు.

కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ నిప్పుల కుంపటేనని బెదిరించారు. ‘నీ ఆటలు ఇంకెంత కాలం రేవంత్? వచ్చే ఎన్నికల్లో నీ పని ఖేల్ ఖతం. వచ్చేది కేసీఆర్ తెలంగాణ రాజ్యమే. అరాచకం చేయిస్తున్న నువ్వు.. నీ సర్కారు గూండాలు, కొందరు కాంగ్రెస్ అనుకూల పోలీసు అధికారులు చంచల్ గూడ జైలుపాలు కాక తప్పదు. తెలంగాణలో  హింసాత్మక ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి రౌడీ పాలనను వదలబోం. కేసీఆర్ తెలంగాణ స్వరం. ఆ గొంతు వింటేనే రేవంత్ రెడ్డికి జ్వరం వస్తోంది’ అని జీవన్​రెడ్డి అన్నారు.