- పాలమూరు ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగడ్తం: కేసీఆర్
- పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సభలు పెడ్త
- చంద్రబాబు కిరికిరి వల్లే డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపింది
- చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది.. రెండేండ్లుగా తట్టెడు మట్టి తీయలే
- ఇప్పుడేమో 45 టీఎంసీలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు
- ఫ్యూచర్ సిటీనా.. తొక్కలో సిటీనా.. ఎవనికి కావాలె ఆ ఫ్యూచర్ సిటీ
- కాంగ్రెస్ హామీలకు జనం టెంప్టయిన్రు.. ఇప్పుడు తలలు బాదుకుంటున్నరు
- పదేండ్లు ప్రశాంతంగా ఉండె.. ఇప్పుడు నడిరోడ్డుపై హత్యలైతున్నయ్
- కేసీఆర్ సచ్చిపోవాలే అనుడు తప్ప కాంగ్రెసోళ్లు ఏం చేస్తున్నరని ఫైర్
- తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ఎల్పీ, కార్యవర్గ సమావేశానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 టీఎంసీలే కావాలంటూ కేంద్రానికి లెటర్ ఎలా రాస్తారని, కేంద్రం డీపీఆర్‌ను ఎలా తిప్పి పంపుతుందని ఆయన ప్రశ్నించారు. రెండేండ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ‘‘రెండేండ్లు చూస్తూ ఊరుకున్నాం. ఇక ఊరుకోకూడదనే బయల్దేరిన. వీళ్లు అడ్డంపొడవు మాట్లాడి.. కిరికిరిలు, కారుకూతలు కూసి ఏదో చేస్తమంటే నడ్వదు. ఇయ్యాల్టిదాకా ఒక కథ.. ఇక నుంచి ఇంకో కథ ఉంటది. ఎక్కడికక్కడ తోలు తీస్తం” అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినంత టైమ్ ఇచ్చామని, ఇప్పుడు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఏర్పడిందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజల్లోనే ఎండగడతామని, నిద్రపోనివ్వబోమని చెప్పారు.తమది తెలంగాణ తెచ్చిన పార్టీ అని, ప్రతిపక్షంగా ప్రజల కోసం కచ్చితంగా పోరాడుతామని తెలిపారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సమావేశమై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. మీటింగ్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాగా, దాదాపు పది నెలల తర్వాత మళ్లీ ఆయన ఇలా మీటింగ్‌కు వచ్చారు. అంతకుముందు పార్టీ ప్లీనరికి సంబంధించి మార్చిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు.
సభలు పెడ్త.. ప్రజా ఉద్యమాలు చేస్త
కేంద్ర ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం చేసిందని, అంత అన్యాయం జరుగుతుంటే.. ప్రజల తరఫున కొట్లాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘ఇంత దద్దమ్మ.. చేతగాని ప్రభుత్వంతో పనులవుతయా? ఏదైనా నష్టం జరుగుతుందంటే రాష్ట్రాలు కొట్లాడుతయ్. కానీ, డీపీఆర్ వెనక్కు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సప్పుడు చేయట్లేదు. ఇప్పుడేమో 45 టీఎంసీలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ మంత్రి కేంద్రానికి లెటర్ రాసిండు. ఏ మొహం పెట్టుకుని కేంద్రానికి లెటర్ రాస్తవ్? ఉన్న నీళ్లను ఎవడన్నా పోగొట్టుకుంటడా? ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్లే కదా అవి. మహారాష్ట్ర, కర్నాటక వాడుకుంటున్నయ్ కూడా. కానీ, ఇక్కడ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నవ్? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా.. అసలు ప్రభుత్వం ఉందా? నిద్ర పోతున్నదా? తెలంగాణకు వాయిస్ ఎక్కడుంది.. ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలి? ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం. ఎంతసేపూ రియల్ ఎస్టేట్ దందా తప్పితే.. ఇంకేం లేదా? హిల్ట్ భూములు ఎత్తుదం.. ఆ భూములు ఎత్తుదం.. ఈడ పెడదాం.. ఆడపెడదాం తప్ప ఇంకేం ఉండదా? రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, ప్రజలు, రైతులు, మనుషులు ఇవన్నీ కాదా.. రెండేండ్ల నుంచి తట్టెడు మట్టి ఎందుకు తియ్యలేదు. ఎవడు ఆపిండు మిమ్మల్ని. దీని వెనుక ఎవడి ఒత్తిడి ఉంది. ఏం కుట్ర చేస్తున్నరు?’’ అని ఆయన మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ఉద్యమాలు చేపడతామని, ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఆ జిల్లాల్లో తానే స్వయంగా బహిరంగ సభలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం గోదావరి మీద నల్లమలసాగర్ అంటూ కొత్త ప్రాజెక్టును తీసుకొస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం లేదని దుయ్యబట్టారు.
పోతిరెడ్డిపాడుకు బొక్కపెట్టి
ఎటెటో తీస్కపోతున్నరు
సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా తీవ్రమైన వివక్షకు గురైందని.. టీడీపీ, కాంగ్రెస్‌లు 50 ఏండ్లు తీవ్ర అన్యాయం చేశాయని కేసీఆర్ మండిపడ్డారు. ‘‘పాలమూరు జిల్లాలోనే కృష్ణా నది 308 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర ఎడమ కాల్వ ద్వారా 174 టీఎంసీలు పాలమూరు జిల్లాకు రావాల్సి ఉంటుంది. అయితే, నాడు ఏపీ ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపంగా మారింది. ఎస్సార్సీ (స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్) ప్రకారం ప్రతిపాదిత ప్రాజెక్టులను మార్చొద్దని స్పష్టంగా చెప్పారు. కానీ, అప్పటి పాలకులు అన్నీ మార్చేశారు” అని దుయ్యబట్టారు. ఏపీ వాళ్లతో ఎప్పుడూ కిరికిరినే ఉంటుందని, పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టి.. తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎటెటో తీస్కపోతున్నారని కేసీఆర్ విమర్శించారు. అందుకే పాలమూరును త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకుని 145 మెగావాట్ల కెపాసిటీ ఉన్న పంపులను పెట్టామని చెప్పారు. దేశంలో అంత పవర్ఫుల్ పంపులు ఎక్కడా లేవన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా 27 వేల ఎకరాల భూములను ప్రాజెక్టు కోసం సేకరించామని, రూ.25 వేల కోట్లు కూడా ఖర్చు చేశామని చెప్పారు. ‘‘ఇంతలోనే మా ప్రభుత్వం మారిపోయింది. ఎప్పుడైనా గెలుపోటములనేవి సహజం. కానీ, రాష్ట్రంలో ఇంత దద్దమ్మ ప్రభుత్వం వస్తదనుకోలేదు. ఎంత దద్దమ్మ ప్రభుత్వమైనా పాత ప్రాజెక్టులను కొనసాగిస్తుంది కదా. వడ్లు కొనకుంటే మేం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసినం ఆనాడు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినం. అలాంటిది మూడు జిల్లాలకు ముఖ్యమైన ప్రాజెక్టు డీపీఆర్‌ను వెనక్కు పంపిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కుయ్యులేదు..కుక్కు లేదు’’ అని ఆయన విమర్శించారు.
నన్ను తిట్టుడు తప్ప ఏం చేస్తున్నరు?
ఫార్మా కంపెనీలు సిటీలోపల ఉండడం వల్ల వ్యర్థాలు నీళ్లలో కలిసి కలుషితమవుతున్నాయని, అందుకే బయటకు తరలించేందుకు జీరో లిక్విడ్ బేస్ ఆధారంగా వ్యర్థాలు లేకుండా ముచ్చర్ల దగ్గర ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. 20 వేల ఎకరాలను సేకరించే ప్రయత్నంలో 14 వేల ఎకరాలను సేకరించామని, జీడిమెట్ల, చర్లపల్లి వంటి ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమలను ఫార్మా సిటీకి తరలించి వ్యర్థాలను కామన్ ఎఫ్లుయెంట్ ప్లాంట్ ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేశామని చెప్పారు. అక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా చేసి భూములను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ఏంది ఈ ఫ్యూచర్ సిటీ.. తొక్కల సిటీ? ఎవనికి కావాలె ఆ ఫ్యూచర్ సిటీ? అన్నీ దిక్కుమాలిన పాలసీలు.. రియల్ ఎస్టేట్ బోగస్ దందాలు తప్ప ఏమున్నయ్. ఫార్మా సిటీ భూముల్లో ఫార్మా కంపెనీలే పెడతామని క్లియర్‌గా చెప్పినం. కానీ, ఇప్పుడు ప్రభుత్వం హైకోర్టుకు ఏం చెబుతుంది. ఫార్మా సిటీలో అంబానీల వంతారా జూ పెడ్తరంట. ఇప్పుడున్న జూను అమ్మేస్తరా? ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు మేం ఎన్నడూ చేయలేదు’’ అని ఆయన విమర్శించారు. మొన్న గ్లోబల్ సమిట్‌లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నదని, గాల్లో మాటలు చెప్పడం కాదు.. కాంక్రీట్ మెజర్స్ ఉంటేనే ఒప్పందాలు జరుగుతాయని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తమని ప్రభుత్వం అంటున్నదని, ఎట్ల చేస్తరని ఆయన ప్రశ్నించారు. పొద్దున లేస్తే కాంగ్రెసోళ్లు తనను తిట్టుడు తప్ప ఏంచేస్తలేరని విమర్శించారు. ‘‘ఎక్కడకు పోయినా కేసీఆర్ సచ్చిపోవాలే.. అని అనడమేనా.. మనుషులకు ఇంత అక్కసుంటదా?’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమాషాలు చేస్తున్నది. అది మొదట్నుంచీ తెలంగాణకు వ్యతిరేకమే. రాష్ట్రానికి ఇప్పటిదాకా పైసా పని కూడా చేయలేదు. ఏం అడిగినా తిరస్కరించడమే. చంద్రబాబు పోయి ఏదో చెప్పడం.. కేంద్రం మన ప్రాజెక్టులను తిరస్కరించడం జరుగుతున్నది. అయినా అప్పుడు మేం గట్టిగానే పోరాడినం. పాలమూరు - రంగారెడ్డికి ఆరేడు పర్మిషన్లు తెచ్చుకున్నం. అందులో ముఖ్యమైన పర్యావరణ అనుమతులు కూడా తీసుకున్నం. కానీ, చంద్రబాబు కుతంత్రాలతో అడ్డుపుల్ల వేసిండు. ఆయన మాటలు పట్టుకుని పాలమూరు - రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపింది. డీపీఆర్ వాపస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఆల్‌పార్టీ డెలిగేషన్ను తీసుకెళ్లి కేంద్రంపై పోరాడాలి కదా! - కేసీఆర్
అప్పుడు జనం టెంప్టయిన్రు..
ఇప్పుడు తలలు బాదుకుంటున్నరు
రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడితప్పాయని కేసీఆర్ దుయ్యబట్టారు. ‘‘ హైదరాబాద్ సిటీలో పట్టపగలు నడిరోడ్డుపై హత్యలు, రేప్‌లు జరుగుతున్నయ్. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నేరాల రేట్ 20 శాతం పెరిగింది. మేం ఉన్నప్పుడు పదేండ్లు ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు హామీల విషయంలో అర్రాస్ పాడి మరీ ఎన్నికలు గెలిచింది. ఆ హామీలకు జనం టెంప్ట్ అయిన్రు. బాగున్న మా పాలనకు మళ్లీ ఓటేద్దామనుకున్నోళ్లు కాంగ్రెస్ హామీలకు టెంప్ట్ అయి అటు ఓటేసిన్రు. ఇప్పుడు తలలు బాదుకుంటున్నరు. రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2500, రూ.4 వేల పింఛన్లు, నిరుద్యోగ భృతి సహా ఎన్నో హామీలు కాంగ్రెస్ ఇచ్చింది. అవన్నీ ఎటుపోయినయ్. బోనస్ ఇస్తమని చెప్పి పంటలు కూడా కొనట్లేదు. బీఆర్ఎస్ ఉన్నంత వరకు యూరియా కోసం చెప్పుల లైన్లు మాయమైనయ్. బీఆర్ఎస్ పోయినంక కాంగ్రెస్ పాలనలో చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నయ్. ఇప్పుడు యాప్ అని తెచ్చిన్రు.. అసలు యాప్ ఎందుకు? రైతుబంధు ఎగ్గొట్టిన్రు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తం, నోటిఫికేషన్లు ఇస్తం అని మస్తు చెప్పిన్రు. కాంగ్రెస్ చేసే పిచ్చిపిచ్చి పనుల వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నది’’ అని పేర్కొన్నారు.
