
- నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది.. ట్రీట్‌మెంట్‌కు కూడా డబ్బుల్లేవ్
- తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని బహిరంగ లేఖ
- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వల్ల నాకు నిలువెల్లా గాయాలే
- నా సమస్యను కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లండి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన డీఎస్పీ నళిని రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖ సంచలనంగా మారింది. తాను రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని, ట్రీట్‌మెంట్‌కు కూడా డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తనకు ఆ ఉద్యమం వల్ల నిలువెల్లా గాయాలే అయ్యాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ప్రస్తుత సర్కారు కూడా తనకు న్యాయం చేయలేదని తెలిపారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో డీఎస్పీ నళిని ఓ లెటర్‌ను పోస్ట్ చేశారు. ఇది తన మరణ వాంగ్మూలం అని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తనకు సాయం చేస్తారని ఎదురు చూశానని, కానీ తన ఫైల్ చెత్తబుట్టపాలైనట్టు తెలిసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తన ఆరోగ్య సమస్య చేరితే సరైన, ఖరీదైన వైద్యం అంది ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
నా జీవితం ముగియబోతున్నది..
తన జీవితం ఇక ముగియబోతున్నదని డీఎస్పీ నళిని లేఖలో పేర్కొన్నారు. తాను మరణిస్తే సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయొద్దని, రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని సంభోదించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ‘‘నా జీవితం ముగియబోతున్నది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్‌గా ఉన్నది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నా.3 రోజుల నుంచి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నా. 8 ఏండ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్.. గత రెండు నెలలుగా టైఫాయిడ్ , డెంగ్యూ,చికెన్ గున్యా వైరస్‌ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది.
ప్రతి కణం పేలిపోతున్నట్లు.. ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి. తట్టుకోలేకపోతున్నాను. 2018 లో ఇలాంటి స్థితి ఏర్పడితే.. ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్లి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్‌లో నెలలపాటు ట్రీట్‌మెంట్ తీసుకున్నా. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. అంత డబ్బు కూడా లేదు’’ అని వ్యాఖ్యానించారు. తనను ఇంతవరకూ ఎవరూ సన్మానించలేదని, తాను చనిపోయాక రాజకీయ లబ్ధి కోసం తన పేరును ఎవరూ వాడుకోవద్దని కోరారు. ‘‘ప్రధాని మోదీని కలవలేకపోయాను. నా మరణానంతరం నా లక్ష్య సాధన కోసం మోదీ ఏమైనా చేయాలి. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు సాయం చేయాలి. వచ్చే జన్మలో మోక్ష సాధన కోసం ప్రయత్నిస్తా’’ అని నళిని తన లేఖలో పేర్కొన్నారు.