భార్యతో కలిసి డచ్ మాజీ ప్రధాని ..స్వచ్ఛంద మరణం

భార్యతో కలిసి డచ్ మాజీ ప్రధాని ..స్వచ్ఛంద మరణం

అమ్​స్టర్ డామ్ : నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రిస్ వాన్ ఆగ్ట్ తన భార్య ఎగ్విన్ తో కలిసి స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించారు. భార్యాభర్తలు ఒకరి చేతిలో మరొకరు చేయి వేసి జంటగా ఈ లోకానికి గుడ్ బై చెప్పారు. ఈ నెల 5న డ్రిస్ తన సొంతూరు నిజ్మజెన్ లో యుథనేసియా ద్వారా తుదిశ్వాస వదిలారని ఆగ్ట్ ఫౌండేషన్ తాజాగా  వెల్లడించింది. డ్రిస్ దంపతులు ఇద్దరికి వయసు పైబడిందని, ప్రస్తుతం వారి వయసు 93 (ఇద్దరిదీ) ఏళ్లని తెలిపింది. 

ఇటీవల బ్రెయిన్ హెమరేజ్​తో డ్రిస్ ఆస్పత్రి పాలయ్యారని పేర్కొంది. డ్రిస్ భార్య ఎగ్విన్ కూడా వయసురీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడడం, కోలుకునే అవకాశాలు లేకపోవడంతో తమకు తాముగా మరణాన్ని ఆహ్వానించారని వెల్లడించింది. కాగా, డ్రిస్ 1977 నుంచి 1982 వరకు నెదర్లాండ్స్ (డచ్) ప్రధానిగా సేవలందించారు. 

కారుణ్య మరణం చట్టబద్దం..

కారుణ్య మరణం (యుథనేసియా)ను నెదర్లాండ్స్ ప్రభుత్వం 2002లో చట్టబద్ధం చేసింది. దీర్ఘకాలిక, కోలుకోవడం సాధ్యం కాని రోగాలతో బాధపడుతున్న వారు స్వచ్ఛందంగా మరణాన్ని ఆహ్వానించవచ్చు. ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే నిశితంగా పరిశీలించిన తర్వాత అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్య సహాయకుడి సాయంతో విషపు ఇంజెక్షన్ తీసుకుని తుదిశ్వాస వదులుతారు.