సర్‌‌‌‌‌‌‌‌ పై  రాజకీయం చేయొద్దు : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

సర్‌‌‌‌‌‌‌‌ పై  రాజకీయం చేయొద్దు : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

యాదాద్రి, వెలుగు : ‘సర్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమంపై రాజకీయం చేయడం సరికాదని, ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మాజీ గవర్నర్​, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. సర్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమంపై బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. సర్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా దొంగ ఓట్లతో పాటు విదేశీయుల ఓట్లు తొలిగి అవకాశం ఉంటుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందన్నారు. కేరళ, తమిళనాడులో సర్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవలేదని, కాంగ్రెస్, టీవీకేనే గెలిచాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్, బిహార్‌‌‌‌‌‌‌‌లో బలంగా ఉన్న బీజేపీ గెలిచిందన్నారు.

తెలంగాణలో ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌ సమస్య పెరిగిపోతోందని, దేశంలోని ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌ బాధిత రాష్ట్రాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. ఫ్లోరైడ్‌‌‌‌‌‌‌‌ సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఇంటింటికి మంచి నీళ్లు అందించడానికి ‘జల్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌’ స్కీంలో కేంద్రం ఫండ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తే.. అప్పటి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ‘మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ’ పేరుతో ఖర్చు చేసిందన్నారు. యాదాద్రి జిల్లాలోని బస్వాపురం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీయడంతో పాటు ఆ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, తుమ్మల యాస్మిన్, మాయ దశరథ, చందా మహేందర్‌‌‌‌‌‌‌‌, రత్నపురం బలరాం పాల్గొన్నారు.