ఎన్ఆర్ఐలకు ఏడాదికి రూ.600 కోట్ల రైతుబంధు : ఆకునూరి మురళి

ఎన్ఆర్ఐలకు ఏడాదికి రూ.600 కోట్ల రైతుబంధు : ఆకునూరి మురళి

తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ విధ్వంసం చేస్తున్నారని ఐఏఎస్  మాజీ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ఉస్మానియా యూనివర్శిటీతో పాటు అన్ని యూనివర్శిటీల్లో పోస్టులు ఖాళీలు ఉన్నా.. భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని 12 యూనివర్శిటీల్లో 3,179 పోస్టులను భర్తీ చేయాలనుంటే కేవలం 818 మంది ఫ్యాకల్టీతోనే రన్ చేస్తున్నారని, ఇంకా 74 శాతం ఫ్యాకల్టీని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో1280 మంది ప్యాకల్టీని భర్తీ చేయాలనుంటే కేవలం 360 మందితో నడిపిస్తున్నారని చెప్పారు. కావాలనే ఫ్యాకల్టీని సీఎం కేసీఆర్ భర్తీ చేయడం లేదన్నారు.

ఓయూలో 920 మంది ఫ్యాకల్టీని భర్తీ చేస్తే ప్రతి ఏడాదికి దాదాపు రూ.155 కోట్లు ఖర్చు మాత్రమే వస్తుందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఓయూలో ఫ్యాకల్టీని భర్తీ చేసేంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవా..? అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ వాళ్లు.. రైతులను చెప్పి వారికి ప్రతి ఏడాదికి రైతుబంధు పేరిట రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అలాంటిది యూనివర్శిటీల్లో ఫ్యాకల్టీని భర్తీ చేసేంత నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవా..? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే సీఎం కేసీఆర్ తెలంగాణను నాశనం పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన ల్యాండ్ ను ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ పరిపాలన తీరును  ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 

‘‘ యూఎస్ లో మంత్రి కేటీఆర్ చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీ ఎలా ఉంది..? ఆయనకు తెలియదా..? ఇక్కడ యూనివర్శిటీలు ఎలా ఉండాలో..? కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివిన మాట అబద్దం’’ అని వ్యాఖ్యానించారు ఆకునూరి మురళి. కొంతమంది IAS, IPS ఆఫీసర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి ముంబయి, ఢిల్లీ, దుబాయ్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారని, సూట్ కేసుల్లో కోట్ల రూపాయలు తీసుకెళ్తూ.. ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కొందరు  IAS ఆఫీసర్లు వ్యాపార దృష్టితోనే పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నవీన్ మిట్టల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. 

ఉస్మానియా యూనివర్శిటీకి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు ఆకునూరి మురళి. యూనివర్శిటీకి వెళ్లే ధైర్యం లేదంటే తప్పు చేస్తున్నట్టే అర్థం కదా..? అని అన్నారు. కేసీఆర్ కు భయం ఉంటే ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ యూనివర్శిటీకి వెళ్లాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో భేటీ అయ్యి.. వారి సమస్యలను అడిగి తెలుసుకుని.. పరిష్కరించాలని కోరారు.