బీఎస్పీలోకి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. డేట్ ఫిక్స్

బీఎస్పీలోకి మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్.. డేట్ ఫిక్స్

హైదరాబాద్: రీసెంట్‌గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రవీణ్ కుమార్‌‌కు ఆఫర్ ఇచ్చినట్టు ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ప్రవీణ్ కుమార్‌‌కు ఇచ్చేందుకు మాయావతి సిద్ధంగా ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలు నిజం కానున్నాయి. బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ చేరికపై ఆయన స్థాపించిన స్వేరోస్ సంస్థ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

వచ్చే నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలోని ఎన్‌‌జీ కాలేజ్ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో బీఎస్పీలో ప్రవీణ్ కుమార్ చేరతారని స్వేరోస్ ఇంటర్నేషనల్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు తెలిపారు. ఈ సభలో 5 లక్షల మంది పాల్గొంటారని, తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరతారని స్వాములు పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేద వర్గాల ప్రజలు లక్షలాదిగా నల్గొండ జిల్లా ఎన్.జి కాలేజ్ మైదానానికి తరలి రావాలని  కోరుకుంటున్నాం. డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మన బతుకులు మార్చడం కోసం గొప్ప త్యాగం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకొని రావాలి’ అని సోలగుల స్వాములు కోరారు.