సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టుల భేటీ

సీపీఎం నేతలతో మాజీ మావోయిస్టుల భేటీ
  • ప్రజా ఉద్యమాల్లోకి రావాలని జాన్ వెస్లీ పిలుపు
  • మర్యాదపూర్వక కలయికేనన్న దేవ్‌‌‌‌జీ బృందం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌‌‌‌లో గురువారం మాజీ మావోయిస్టు నేతలు దేవ్‌‌‌‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న, పద్మక్క, సంజీవ్, బండి ప్రకాశ్‌‌‌‌.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

భేటీ అనంతరం జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో నిరంకుశంగా నరమేధాన్ని సృష్టించిందని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. వారిపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశంలో దోపిడీ పెరిగిపోతోంద‌‌‌‌ని, మతోన్మాదం రాజ్యమేలుతోంద‌‌‌‌ని, వీటికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో కలిసివచ్చే ఎవరినైనా సీపీఎం ఆహ్వానిస్తుంద‌‌‌‌ని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు: దేవ్‌‌‌‌జీ

ప్రజాస్వామికవాదులను కలవడంలో భాగంగానే ఎంబీ భవన్‌‌‌‌కు వచ్చామని మాజీ మావోయిస్టు నేత దేవ్‌‌‌‌జీ వెల్లడించారు. ఆపరేషన్ కగార్‌‌‌‌ను ఆపాలని, శాంతి చర్చలు జరపాలని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ గళం విప్పాయ‌‌‌‌ని, అందుకే కృతజ్ఞతలు చెప్పేందుకే కలిశామ‌‌‌‌ని పేర్కొన్నారు.

అంతకుమించి ఇందులో రాజకీయ అంశాలు లేవ‌‌‌‌ని వివరించారు. కొత్త పార్టీ పెట్టడం లేదా ఏ పార్టీలోనైనా చేరడం వంటి అంశాలపై చర్చించే సమయం ఇది కాదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ రావు, టి. సాగర్, ఎండీ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు