ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్

ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ఎండీ సాంబశివరావు అరెస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ కోసం ఏర్పాటు చేసిన ఫైబర్ నెట్ సంస్థలో అవకతవకలు జరిగాయనే అభియోగంతో ఆ సంస్థ మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును అరెస్టు చేశారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఏపీ ఫైబర్ నెట్ లో దాదాపు 321 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని ఆరోపణలతో సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో ఈ కేసు గురించి మాజీ ఎండీ సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు.

ఈయన ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా వ్యవహరించిన సమయంలో అక్రమాలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి ఆరోపించారు. 321 కోట్ల రూపాయల టెండర్ ను తమకు కావాల్సిన టెరా సాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టేందుకు అక్రమాలకు పాల్పడ్డారని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి.. బిల్లులు లేకుండా చెల్లింపులు జరిపారని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న సీఐడీ 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా విచారణను వేగవంతం చేసిన సీఐడీ మాజీ ఎండీ సాంబశివరావును కొద్దిసేపటి క్రితం అరెస్టు చేసింది. న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు తరలించనున్నారు.