కేసీఆర్​ను ఓడించకుంటే  బానిసలైతం

కేసీఆర్​ను ఓడించకుంటే  బానిసలైతం
  • కుమ్మర్ల శంఖారావంలో ఈటల రాజేందర్
  • సీఎంకు ఓట్లు కావాలె.. జనాన్ని పట్టించుకోరు
  • హుజూరాబాద్​కు పైసలను వాళ్ల ఇంట్లకెళ్లి ఇస్తలేరు
  • కాళేశ్వరం అక్రమ సంపాదనను పంచుతున్నరని ఆరోపణ

హుజూరాబాద్ టౌన్, వెలుగు: సీఎం కేసీఆర్ ను ఓడించకపోతే బానిసలుగా మారతామని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్​కు ఓట్లు కావాలని, ప్రజల మేలు పట్టించుకోరని విమర్శించారు. ఓట్ల కోసమే మొదటిసారి దళితులను పిలిపించుకొని బువ్వ పెట్టి పోయారన్నారు. ఇప్పుడు హుజూరాబాద్​కు ఇస్తున్న డబ్బులు మన చెమట చుక్కలేనని, ఇంట్లకెళ్లి ఇస్తలేరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించుకున్న డబ్బు తీసుకొచ్చి కేసీఆర్ ఇక్కడ పంచిపెడుతున్నారని విమర్శించారు. తమ దగ్గర పనిచేసుకోని వాళ్లు ఎవరెవరో ఇక్కడికొచ్చి తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం హుజూరాబాద్ లోని మధువని గార్డెన్ లో గురువారం కుమ్మర్ల కుల శంఖారావంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల మాట్లాడారు.
ఓట్ల కోసమే హుజూరాబాద్​లో పనులు
ఓట్ల కోసమే హుజూరాబాద్ లో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఈటల అన్నారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువకులు సంబురపడ్డారని, నాటి నుండి కుల వృత్తులను నమ్ముకుని బతుకుతున్న అన్ని కులాలు బాగుపడలేదని చెప్పారు. రాష్ట్రం వచ్చాక యువకులకు శిక్షణ ఇచ్చారు కాని ఏమీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం దళితవాడకు వెళ్లి ఇంటికో రూ. 10 లక్షలు ఇస్తామని, గులాబీ కండువా కప్పుకోవాలని టీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు. ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలను ఓట్ల కోసమే అందిస్తున్నారని విమర్శించారు. ‘ఈటల ఉద్యమ కారుడిగా మేలు చేసిండు. ఎమ్మెల్యేగా మేలు చేసిండు. మంత్రిగా మేలు చేసిండు. ఇప్పుడు రాజీనామా చేసి కూడా మేలు చేస్తున్నాడు’ అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. హర్యానా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రామేశ్వర్, నేషనల్ ఖాదీ బోర్డు చైర్మన్ శేఖర్ జీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీయస్​యస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ ఎంబీసీ రాష్ట్ర అధక్షుడు దొమ్మాట వెంకటేశ్, కర్నాటక కుమ్మర సంఘ అధ్యక్షుడు శంకర్, ఆంధ్రప్రదేశ్​కుమ్మర యువసేన అధ్యక్షుడు సుమన్, బీజేపీ జిల్లా అధక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, తెలంగాణ కుమ్మర సంఘం నాయకులు శ్రీనివాస్, సూర్యారావు పాల్గొన్నారు.