- అల్లుడితో కలిసి పార్టీలోచేరేందుకు ప్రయత్నాలు
- కొడుక్కు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్టులు
- ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో 2 గంటలపాటు చర్చలు
- తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని విన్నపాలు
హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయనతోపాటు ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తన కుమారుడు భద్రారెడ్డికి కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్‌ను కూడా మల్లారెడ్డి అడుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇదే క్రమంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో మామాఅల్లుళ్లు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గచ్చిబౌలిలోని వేం నరేందర్‌రెడ్డి ఇంట్లో 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు. ఒకవైపు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్న టైమ్‌లోనే.. ఈ ఇద్దరు కలిసి వేం నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని, కాంగ్రెస్ లో చేరుతామని, విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వేం నరేందర్‌రెడ్డితో మల్లారెడ్డి
రాజశేఖర్ రెడ్డి అన్నట్లు తెలుస్తున్నది. తన కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ నుంచి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ వచ్చేలా చూడాలని కూడా రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు కనిపించడం లేదని, అందుకే కాంగ్రెస్ టికెట్ అడిగినట్లు ప్రచారం జరుగుతున్నది.
భద్రారెడ్డికి ఇవ్వొద్దంటున్న కాంగ్రెస్ నేతలు
వేం నరేందర్‌రెడ్డిని మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కలువడంతో మల్కాజ్గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. భద్రారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామని కాంగ్రెస్ నేతలు అన్నట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతున్నదని, ఈ ప్రాసెస్ ఆగదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
