జనగామ, వెలుగు : నర్సంపేటకు వెళ్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జనగామ జిల్లా పెంబర్తిలో పోలీసులు అడ్డుకోగా ఆయన హైవేపై కూర్చొని నిరసన తెలిపారు. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంతో బీఆర్ ఎస్ పార్టీ నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చింది.
ఈ బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎర్రబెల్లిని పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తాను పెండ్లికి వెళ్తున్నానని చెప్పినా వదలకపోవడంతో ఆయన జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకొని జనగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని అక్కడే బైఠాయించారు. సాయంత్రం ఎర్రబెల్లిని విడుదల చేశారు.
కాంగ్రెస్‌ది అరాచక పాలన
పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని సూచించారు. రెండేండ్లలో కేసీఆర్ సీఎం అవుతారన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు.
