హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం (మే 29) హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. వెంకటరెడ్డి మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వెంకటరెడ్డి మరణంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గాదె వెంకటరెడ్డి బ్యాగ్రౌండ్ ఇదే
1940 జూలై 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో గాదె వెంకటరెడ్డి జన్మించాడు. ఎల్ఎల్బీ కంప్లీట్ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయ అరంగ్రేటం చేశారు. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తరువాత 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా.. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు సార్లు మద్దుకూరి నారాయణ రావుపై ఓడిపోయారు.
1983, 1985,1989 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు. తిరిగి 1991 ఉప ఎన్నికల్లో అలాగే 1994 సార్వత్రిక ఎన్నికల్లో పరుచూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు.
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో పని చేసిన ఆయన 2016 ఏప్రిల్ 29ను హస్తం పార్టీకి వీడ్కోలు పలికి టీడీపీలో చేరారు. నాలుగేండ్ల తర్వాత టీడీపీకి రిజైన్ చేసి 2020 మార్చి 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వయోభారం, అనారోగ్య సమస్యతలతో గత కొద్ది రోజులుగా ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.
