రైతుబంధు ఎప్పుడు ఇస్తరు? .. రాష్ట్ర రైతులంతా ఎదురు చూస్తున్నరు: హరీశ్‌‌రావు

రైతుబంధు ఎప్పుడు ఇస్తరు? .. రాష్ట్ర రైతులంతా ఎదురు చూస్తున్నరు: హరీశ్‌‌రావు

మేనిఫెస్టోలో రూ.15 వేలు ఇస్తమని చెప్పారని వెల్లడి 
అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన ఉంటామన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే 

హైదరాబాద్,వెలుగు:  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతుబంధు డబ్బులు రూ.15 వేలను వెంటనే రైతుల ఖాతాలో వేయాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే డిసెంబర్‌‌‌‌ 9న రైతుబంధు నిధులను వారి ఖాతాలో వేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, జగదీశ్‌‌ రెడ్డి, తెల్లం వెంకట్ రావు, సంజయ్‌‌తో కలిసి హరీశ్‌‌రావు మాట్లాడారు.

రాష్ట్ర రైతాంగం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. రైతులు వడ్లు అమ్ముకోవద్దని, బోనస్​ 500 రూపాయలతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌‌ పార్టీ చెప్పిందని, కొనుగోళ్లు ఎప్పుడు మొదలు పెడతారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. తుఫాన్ కారణంగా చాలా ప్రాంతాల్లో వడ్లు తడిచిపోయాయని, కల్లాల్లోనే ధాన్యం పాడైపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు, రైతుల పక్షాన తాము పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలకు ఇంకా సమయం ఉందన్న హరీశ్ రావు.. బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఏటా నవంబర్‌‌‌‌ చివరి వారం నుంచి డిసెంబర్‌‌‌‌ మొదటి వారానికే రైతుబంధు ఇచ్చిందని గుర్తుచేశారు. 

పేదల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

ప్రజా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌‌ వద్ద ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మద్దతుతో తాను గెలిచానని, ప్రభుత్వం సహకరిస్తే సమన్వయంతో కలిసి పని చేస్తానన్నారు. లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిణామాల దృష్ట్యా తాము పొత్తులకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అవినీతి, ఉపా చట్టాలకు వ్యతిరేకంగా తన పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. 
-సీసీఐ ఎమ్మెల్యే కూనంనేని

నాన్నను ఆదర్శంగా  తీసుకుని అభివృద్ధి చేస్తా

మా తాత, నాన్నను ఆదర్శంగా తీసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్‌‌ సీనియర్‌‌‌‌ నేత జానారెడ్డి కుమారుడు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చిన ఏఐసీసీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌‌ఎల్‌‌బీసీ కాల్వను మరో 9 కిలోమీటర్లు పొడిగించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.

కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా

గడీల పాలనకు అంతం పలికామని రామగుండం కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికుల గౌరవం కాపాడుతానని, కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని తెలిపారు. గడీల పాలనకు ప్రజలు చరమగీతం పాడి తనకు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా సింగరేణి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. 25 ఏండ్ల తన సుదీర్ఘ పోరాటానికి ఫలితం లభించిందని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే మక్కన్ సింగ్