
- ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరిన రేషన్ డీలర్లు
హైదరాబాద్, వెలుగు: రేషన్ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమీషన్ చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటమాడడం దుర్మార్గమన్నారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి వచ్చిందన్నారు.
మంగళవారం హైదరాబాద్ లో హరీశ్‌ను ఆయన నివాసంలో రేషన్ డీలర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్‌అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని, అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు అన్నారు.