- ‘రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే నినాదం వినిపిస్తున్నది: జీవన్ రెడ్డి
జగిత్యాల, వెలుగు: తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ప్రతి పల్లెలో “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అనే నినాదం వినిపిస్తున్నదని పేర్కొన్నారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో జీవన్‌రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఇది ఒక కీలక మలుపు అని వ్యాఖ్యానించారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజల ఆశీస్సులతో ఎదిగానని చెప్పారు. 4 దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసినప్పటికీ, తనపై పార్టీ చూపిన వివక్ష బాధ కలిగించిందని అన్నారు. గత 20 నెలలుగా మానసిక వేదన అనుభవించానని, కాంగ్రెస్ పార్టీలో తనకు దక్కింది ఏమిటో ప్రజలే ఆలోచించాలని వ్యాఖ్యానించారు. 1999లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలోనే తెలంగాణ సాధన కోసం కేసీఆర్ పిలుపునిచ్చినా, క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్‌లోనే కొనసాగానని తెలిపారు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి పెద్ద మనసుతో చేయూతనిచ్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను విస్మరించిందని జీవన్ రెడ్డి విమర్శించారు. పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్య క్రమం సమర్థవంతంగా అమలైందని జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై తనకు విద్యార్థి దశ నుంచే గౌరవం ఉందని, కలిసి ప్రయాణించిన అనుభవం ఉందని తెలిపారు.
అలాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిన్నటి వరకు నిద్రపోయిన రేవంత్ రెడ్డి, కేసీఆర్ జగిత్యాలకు రావడంతో మేల్కొన్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన శని పీడ తొలగాలంటే కేసీఆర్ నాయకత్వమే మార్గమని విశ్వసించి బీఆర్ఎస్‌లో చేరినట్టు తెలిపారు. యావత్ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.

