
పద్మారావునగర్, వెలుగు: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి పరామర్శించారు. బీజేవైఎం నాయకుడు పురూరవరెడ్డితో కలసి అపోలో హాస్పిటల్‌కు వెళ్లిన ఆయన షర్మిలను పరామర్శించి కొద్దిసేపు మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడే ఉన్న తల్లి విజయమ్మను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పాదయాత్ర, దీక్షలు చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు దించుదామా అని జనం ఎదురు చూస్తున్నారని అన్నారు.
అల్కాపురి చౌరస్తాను సిగ్నల్ ఫ్రీగా మార్చాలి: నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ
ఎల్బీనగర్, వెలుగు: నాగోల్ డివిజన్ పరిధి అల్కాపురి చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్‌ను బంద్ చేసి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ చింతల అరుణ అధికారులను కోరారు. ట్రాఫిక్ ఏసీపీ అంజయ్య, సీఐ వెంకటేశ్వర్లు, బల్దియా డీఈ పుణ్యనాయక్‌తో కలిసి సిగ్నల్ వ్యవస్థను పరిశీలించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ.. అల్కాపురి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ వల్ల వెహికల్స్ రద్దీతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆమె చెప్పారు. ఇక్కడ ఫ్లై ఓవర్ లేదా అండర్ పాస్ ఉంటే సిగ్నల్ ఫ్రీ వ్యవస్థతో తొందరగా గమ్యాన్ని చేరుకుంటారన్నారు. ఆమె వెంట బీజేపీ నాయకులు సిద్దాల ఐలయ్య, రాఘవాచారి, నాగరాజు ఉన్నారు.
నిధులు మంజూరైనా డ్రైనేజీ పనులు ఎందుకు పూర్తి చేయట్లే?: గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని
ముషీరాబాద్, వెలుగు: అధికారుల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని అన్నారు. వాటర్ బోర్డు జీఎం శ్రీధర్ రెడ్డి, మేనేజర్ కృష్ణమోహన్, బీజేవైఎం నగర మాజీ అధ్యక్షుడు వినయ్ కుమార్, స్థానికులతో కలిసి డివిజన్లోని మాధవరావు కాలనీని సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. ఈ కాలనీలో 9 నెలల కిందట రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి, అనంతరం డ్రైనేజీ పైప్ లైన్ పనులకు నిధులు మంజూరు చేయిస్తే నేటికీ అవి పూర్తి కాలేదన్నారు. గ్రేటర్ ఎన్నికల టైమ్‌లో గాంధీనగర్ డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.. దీన్ని దత్తత తీసుకొని అద్దంలా చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాగా డ్రైనేజీ సమస్యపై జీఎం శ్రీధర్ రెడ్డిని వివరణ కోరగా.. డ్రైనేజ్ పైప్ లైన్ పనుల్లో ఆలస్యం అవుతోందనేది వాస్తవమేనని చెప్పారు. నిధులు మంజూరైనా టెండర్లో ఆలస్యం జరిగిందన్నారు. పది రోజుల్లో పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్‌లోనే కార్యకర్తలకు ఉన్నత పదవులు:పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్
మేడిపల్లి, వెలుగు: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి ఉన్నత పదవులు అప్పగించడం కాంగ్రెస్‌లోనే సాధ్యమని పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షునిగా వజ్రేశ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పొన్నం తరుణ్ నియామకం నేపథ్యంలో సోమవారం బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు పీఎంజీ కన్వెన్షన్ హాల్లో వారిని సన్మానించారు. అనంతరం వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ.. పనిచేసే కార్యకర్తలు, నాయకులను పార్టీ ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్ర శివశంకర్, పోచారం మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ సెగ్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్, బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిశోర్ గౌడ్, బాలరాజ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, రాపోలు శంకరయ్య, తోటకూర మల్లేశ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో అక్రమ మైనింగ్ ఆపాలి
ఖైరతాబాద్, వెలుగు: అబ్దుల్లాపూర్‌మెట్‌లో అక్రమంగా నడిపిస్తున్న మైనింగ్‌ను వెంటనే ఆపేయాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. ఆ భూములను రైతులకు పంచాలన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ రైతులతో కలిసి సోమవారం ఆయన ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని బండ రావిరాల, చిన రావిరాల, తారామతిపేట, దేశముఖి గ్రామాల్లోని వందల ఎకరాల్లో మైనింగ్, క్రషింగ్ యూనిట్లను అక్రమంగా నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఈ మైనింగ్ కంపెనీల వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారని, అందుకే ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తమ భూములను తమకే కేటాయించాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీ లు ప్రదర్శించారు. కాగా జడ్సన్‌తో పాటు పలువురు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు.
మహిళలపై హింస లేని సమాజం కావాలి: ఐద్వా ఉపాధ్యక్షురాలు పుణ్యవతి
ముషీరాబాద్, వెలుగు: మహిళలపై హింస లేని సమాజాన్ని సాధించాలని ఐద్వా(ఆలిండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్) ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతి అన్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో ‘హింసను ఎదిరిద్దాం.. అవరోధాలను అధిగమిద్దాం.. నవ సమాజాన్ని నిర్మిద్దాం’ అంశంపై సెమినార్ జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన పుణ్యవతి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై రోజురోజుకు దాడులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలపై జరిగే దాడులను అడ్డుకోవాలన్నారు. వచ్చే నెల 6 నుంచి 9 వరకు కేరళలోని త్రివేండ్రంలో జరిగే ఐద్వా మహాసభలకు ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ట్రం నుంచి 41 మందిని ఎన్నుకున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఆశాలత, హైమావతి, ఇందిరా, సరళ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అంకుషాపూర్‌లో జమ్మూకాశ్మీర్ సర్పంచ్ల బృందం
ఘట్‌కేసర్, వెలుగు: జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్ రీజియన్‌కు చెందిన 30 మంది మహిళా సర్పంచుల బృందం సోమవారం మేడ్చల్ జిల్లా అంకుషాపూర్ పంచాయతీలో పర్యటించింది. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డ్, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించింది. పంచాయతీ నిర్వాహణ, డ్వాక్రా మహిళ సంఘాల నిర్వహణ, సంఘాల రుణం, ఆదాయం, చెల్లింపులు, మహిళల స్వయం ఉపాధికి సంబంధించిన వివరాలను ప్రజాప్రతినిధులను అడిగి వారుతెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ దైవసహాయం, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, డీఎల్పీవో స్మిత, ఎంపీడీవో అరుణారెడ్డి, సర్పంచ్ జలజ తదితరులు పాల్గొన్నారు.
లిక్కర్ స్కామ్‌లో చట్ట ప్రకారమే సీబీఐ విచారణ: బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్ ఇన్చార్జి అందెల శ్రీరాములు
ఎల్బీ నగర్, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ చట్టప్రకారమే విచారిస్తోందని బీజేపీ మహేశ్వరం సెగ్మెంట్ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌లోని యూత్ బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువత పెద్దఎత్తున బీజేపీలో చేరారు.ఈ సందర్భంగా వారికి శ్రీరాములు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున యువత ముందుకొస్తున్నారని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలపైనా ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయటం బీఆర్ఎస్ నేతలకే చెల్లిందన్నారు. మైనింగ్ కేసులో మంత్రి సబితా రెడ్డి ఏదో ఒకరోజు జైలుకెళ్లక తప్పదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్పొరేటర్ గౌర రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, వెలుగు: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్విడుదల చేసిన ఉద్యోగ ఖాళీల జాబితా ప్రకారం.. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే 17,134 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే భర్తీ చేయాలంటూ వినోద్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. ఈ విషయంపై మన రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు. రైల్వే శాఖతో పాటు పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏడేండ్ల తర్వాత స్కూల్‌కు కరెంట్
పెండింగ్ బిల్లు చెల్లించిన బీజేపీ నేత
సన్మానించిన టీచర్లు, స్టూడెంట్లు
జీడిమెట్ల, వెలుగు: స్టూడెంట్లకు సాయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి అన్నారు. జీడిమెట్ల(132) డివిజన్ పేట్‌బషీరాబాద్ మండల పరిషత్, అంగన్‌వాడీ కేంద్రాల కరెంట్ బిల్లులు గత 7 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కరెంట్ లేక స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను భరత్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఆయన మొత్తం బిల్లు రూ. లక్షా 3 వేల 500 చెల్లించారు. ఇందుకు కృతజ్ఞతగా టీచర్లు, స్టూడెంట్లూ ఆయనను సోమవారం సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
యువతి కిడ్నాప్ కేసు.. పరారీలోనే నవీన్ రెడ్డి
శంషాబాద్ వద్ద కారు వదిలిపెట్టి పోయినట్లు గుర్తింపు
ఎల్ బీ నగర్, వెలుగు: మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 32 మందిని అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్న పోలీసులు నవీన్ రెడ్డి ఆచూకీ మాత్రం తెలియలేదని చెప్తున్నారు. ఈ కేసులో నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక టీమ్ సోమవారం శంషాబాద్ ఓల్డ్ విలేజ్ సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో నవీన్ రెడ్డికి చెందిన వోల్వో కారు(టీఎస్07 హెచ్ఎక్స్ 2111)ను గుర్తించారు. ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొదటి నుంచీ పోలీసుల తీరుపట్ల విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే, నిందితుడిని అదుపులోకి తీసుకోలేదని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వర్ స్పష్టం చేశారు.