కేటీఆర్.. నీ స్థాయి వేరనుకుంటే రాజకీయ జీవితం ఖతమైనట్లే

కేటీఆర్.. నీ స్థాయి వేరనుకుంటే రాజకీయ జీవితం ఖతమైనట్లే

హైదరాబాద్: వైట్ ఛాలెంజ్ సమాజానికి మంచిదని, ఇలాంటి వాటికి నాయకులు ముందుకొస్తే ఆదర్శప్రాయంగా ఉంటుందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌కు కేటీఆర్ ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. తన స్థాయి వేరు అంటూ రాహుల్‌ గాంధీతో కేటీఆర్ పోల్చుకోవడం సరికాదన్నారు. ఎప్పుడైతే తన స్థాయి వేరు అని అన్నారో అప్పుడే ఆయన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడిందన్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిందన్న విశ్వేశ్వర్ రెడ్డి.. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల పాప హత్యాచారానికి డ్రగ్సే కారణమన్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులందరూ డ్రగ్ టెస్టు రిపోర్టు సమర్పించేలా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

బండి సంజయ్, ప్రవీణ్‌ కుమార్‌ ఒప్పుకుంటే హ్యాపీ

‘ఎలక్షన్ పిటిషన్‌లో డ్రగ్ టెస్టు రిజల్ట్ తప్పకుండా ఉండాలె. అమెరికాలో చిన్న ఉద్యోగానికి కూడా డ్రగ్ టెస్ట్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ రాజకీయ నాయకులకు డ్రగ్ టెస్ట్ చేయకూడదా? నాయకులు వైట్ ఛాలెంజ్‌కు ముందుకు రావాలె. ఈ టెస్టుకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఎక్కడికి వచ్చినా రావడానికి నేను రెడీ. ఈ టెస్టు రెండు పార్టీల మధ్య పోటీగా మారుతోంది. ఇది సరైంది కాదు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తోపాటు బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌ కూడా ఈ టెస్టులో పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసురుతున్నా. వాళ్లు ఈ ఛాలెంజ్‌కు ఒప్పుకుంటే సంతోషకరం. దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా’ అని విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు.