ఇవాళ కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే వీరేశం

ఇవాళ కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే వీరేశం
  • ముఖ్యనేతలతో కలిసి శుక్రవారమే ఢిల్లీకి పయనం.. 
  • బీసీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​తో పాటు ఫార్వర్డ్​ బ్లాక్​ నేతలూ చేరిక 

నల్గొండ, వెలుగు: నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం కాంగ్రెస్​లో చేరనున్నారు. శుక్రవారం ఆయనతోపాటు, బీసీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ పూజర్ల శంభయ్య పలువురు ముఖ్యనేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శనివారం పార్టీ ముఖ్యనేతల సమక్షంలో కాంగ్రెస్​పార్టీలో చేరుతున్నట్టు వీరేశం తెలిపారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నా రు. అలాగే, నియోజకవర్గంలో మరికొంత మంది ముఖ్యనేతలు, ఫార్వర్డ్​ బ్లాక్​ తరఫున గెలిచిన వీరేశం వర్గీయులు కూడా కాంగ్రెస్​లో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో నకిరేకల్​లో ​బీఆర్ఎస్ నుంచి వీరేశం ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో ఓడిపోయారు. ఆయన మీద గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్​లో చేరడంతో వీరేశాన్ని పార్టీ పక్కన పెట్టింది. దీంతో గత ఐదేండ్ల నుంచి ఆయన స్వతంత్రంగానే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. లోకల్​ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా ఫార్వర్డ్ బ్లాక్​ తరఫున తన క్యాండేట్లను నిలబెట్టి సత్తా చాటుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో రాజకీయ విభేదాలు ముదిరిపోవడంతో హైకమాండ్​ వీరేశానికి ప్రాధాన్యాన్ని తగ్గించింది. ఆయన అనుచరుల పైనా పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ టికెట్​తనకే వస్తదని ఆశించారు. కానీ సీఎం సిట్టింగ్​లకే టికెట్లు​కన్​ఫర్మ్​ చేయడంతో వీరేశం బీఆర్​ఎస్​కు రిజైన్​ చేశారు. వచ్చే ఎన్ని కల్లో తన సత్తా చూపిస్తానని చాలెంజ్​ చేశారు. 

వీరేశం రాకను వ్యతిరేకించిన వెంకటరెడ్డి వర్గం

వీరేశం రాకను నకిరేకల్​ కాంగ్రెస్​లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ వెంకటరెడ్డి స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంలలో ఇటీవల జరిగిన మీటింగ్​లో వీరేశం రాకకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. పైగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సపోర్ట్​ కూడా ఆయనకు ఉంది. పొంగులేటితో పాటు వీరేశం పార్టీలో చేరాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్​ నాయకత్వాన్ని మెప్పించడానికి ఇంత టైం పట్టింది. హైదరాబాద్​లో జరిగిన సోనియాగాంధీ సభలో వీరేశం చేరుతారని భావించారు. కానీ వివిధ కారణాలతో సాధ్యం కాలేదు. ఇది 
అప్పుడు అనేక అపోహలకు దారితీసింది.