పాక్పై అమెరికా దాడి చేస్తే..ముంబై, ఢిల్లీపై బాంబులేస్తం! : పాక్ మాజీ దౌత్యవేత్త బాసిత్

పాక్పై అమెరికా దాడి చేస్తే..ముంబై, ఢిల్లీపై బాంబులేస్తం! : పాక్ మాజీ దౌత్యవేత్త బాసిత్
  •     పాక్​ మాజీ దౌత్యవేత్త బాసిత్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ భారత్​పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు అమెరికా దాడులు చేస్తే.. రెండో ఆలోచన లేకుండా ముంబై, ఢిల్లీ నగరాలపై బాంబులేస్తామన్నారు. అమెరికా తమ క్షిపణి పరిధిలో లేకపోవడంతో భారత్ పై దాడి చేయడం ద్వారా ప్రతిఘటిస్తామని పేర్కొన్నారు. 

అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఇటీవల పాకిస్తాన్ అణు క్షిపణి వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. ఓ పాకిస్తానీ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో బాసిత్ ఈ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్షిపణులు అమెరికాకు ముప్పుగా మారుతున్నాయని తులసీ గబ్బార్డ్ పేర్కొనడాన్ని తప్పుబట్టారు. 

ఆమె భారత సంతతి వ్యక్తి కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని, భారత్ వద్ద ఉన్న అగ్ని-–5, 6 వంటి ఖండాంతర క్షిపణులు ఆమెకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అమెరికా ఎప్పటికీ పాకిస్తాన్‌‌కు శాశ్వత భాగస్వామి కాలేదని బాసిత్ చెప్పారు.  టీవీ యాంకర్ ‘మనం గతంలోనే ట్రైలర్ చూపించాం’అని 26/11 ముంబై ఉగ్రదాడులను పరోక్షంగా ప్రస్తావించారు. దానికి బాసిత్ స్పందిస్తూ, ‘‘మనం గతంలో చేశాం. మళ్లీ ఇక్కడి నుండే చేస్తాం’’అంటూ సమాధానమిచ్చారు.