హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్‌లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మాజీ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీ పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ డి.దివ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
