మెహిదీపట్నం, వెలుగు: తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలనే డిమాండ్‌తో జూన్ 1న సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని రాష్ట్ర మాజీ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం లంగర్ హౌస్ బాపూ ఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి నివాళులర్పించి, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. 2019– 2024 మధ్య గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన తమకు బిల్లులు అందక 31 నెలలుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల కొందరు సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన ముట్టడిని విజయవంతం చేయాలని మాజీ సర్పంచులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, అంజయ్య గౌడ్, అరవింద్ రెడ్డి, సుధాకర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
