ట్రంప్ సలహాదారులుగా మాజీ టెర్రరిస్టులు.. వెల్లడించిన జర్నలిస్ట్ లారా లూమర్..!

ట్రంప్ సలహాదారులుగా మాజీ టెర్రరిస్టులు.. వెల్లడించిన జర్నలిస్ట్ లారా లూమర్..!

వాషింగ్టన్: మాజీ టెర్రరిస్టులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎కు సలహాదారులుగా నియమించారు. లష్కరే తోయిబా, అల్ కాయిదాతో సంబంధాలు ఉన్న ఇస్మాయిల్ రోయర్, టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్  హమ్జా యూసుఫ్‎ను వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమిస్తూ వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇస్మాయిల్‎కు 2008 ముంబై దాడులతో సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా కాశ్మీర్‎లోని సైనిక స్థావరాలపైనా అతను కాల్పులు జరిపాడని అమెరికాకు చెందిన ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు లారా లూమర్  తెలిపారు.అలాగే, యూసుఫ్‎పై ఇండియాకు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇప్పటికే పలు అభియోగాలు మోపిందని పేర్కొన్నారు. ఇస్మాయిల్ రోయర్ పుట్టుకతో అమెరికన్. 1992లో ఇస్లాం స్వీకరించి పేరు మార్చుకున్నాడు.

‘‘2000 సంవత్సరంలో ఇస్మాయిల్  రోయర్  పాకిస్తాన్ వెళ్లి ఒక టెర్రర్ క్యాంపులో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. జిహాదీ భావజాలాన్ని వంటపట్టించుకున్నాడు. అలాంటి వ్యక్తిని వైట్ హౌస్  అడ్వైజరీ బోర్డులో నియమించారు” అని లూమర్  ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అమెరికాలో టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడడంతో 2003లో ఇస్మాయిల్‎పై అభియోగాలు నమోదయ్యాయని ఆమె గుర్తుచేశారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించిన కేసులో 2004లో ఇస్మాయిల్‎కు 20 ఏండ్ల జైలుశిక్ష పడింది. 13 ఏండ్లు జైలుశిక్ష అనుభవించి 2017లో విడుదల అయ్యాడు.

ఎవరీ షేక్  యూసుఫ్..?

షరియా గురించి బోధించే జోటునా కాలేజీ కోఫౌండర్ హమ్జా షేక్ యూసుఫ్. హమాస్​తో సంబంధాలు ఉన్నాయి. 9/11 దాడులకు ముందు జమీల్ అల్ అమీన్ (ఓ పోలీస్​ఆఫీసర్‎ను హత్య చేశాడు) కోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాను జాత్యంహకార దేశంగా యూసుఫ్​అభివర్ణించాడని లారా లూమర్ గుర్తుచేశారు.