న్యూఢిల్లీ, వెలుగు: కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంలో ‘లై డిటెక్టర్’ పరీక్షకు సిద్ధమని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత పదేండ్లలో నెయ్యి సరఫరాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వార్థం కోసం దేవాలయాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీటీడీ ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా తాను వ్యవహరించ లేదని తెలిపారు. టీటీడీ లడ్డూ ప్రసాదంపై ఉద్దేశపూర్వకంగానే విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే తనపై నిందలు మోపుతున్నారని చెప్పారు. 30సార్లు అయ్యప్ప మాలధరణ చేసిన తాను దేవుడి విషయంలో ఎప్పుడూ ఎటువంటి తప్పిదాలు చేయబోనని క్లారిటీ ఇచ్చారు.
