కాంగ్రెస్ పవర్ లో ఉంటే రాష్ట్రం ఇంకోలా ఉండేది: చిదంబరం

కాంగ్రెస్ పవర్ లో ఉంటే రాష్ట్రం ఇంకోలా ఉండేది: చిదంబరం
  • కాంగ్రెస్​ ఓట్లు చీల్చడమే ఆ పార్టీ లక్ష్యం: రేవంత్​రెడ్డి
  • ఇక్కడ కూడా కర్నాటక లెక్క చేయాలనుకుంటున్నరని ఫైర్​
  • కాంగ్రెస్ పవర్‌‌‌‌లో ఉంటే..రాష్ట్రం ఇంకోలా ఉండేది
  • సోనియా వల్లే తెలంగాణ వచ్చింది: చిదంబరం

హైదరాబాద్, వెలుగు: సోనియా గాంధీ చొరవ చూపడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్ కాకుండా మరోపార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ.. కేసీఆర్ అవినీతిపై ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారని, అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. శనివారం సికింద్రాబాద్‌‌లోని హరిహర కళాభవన్‌‌లో క్రిస్టియన్​ కోఆర్డినేషన్ కమిటీ నిర్వహించిన క్రైస్తవుల హక్కుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘క్రిస్టియన్ సామాజిక వర్గం.. రాష్ట్రంలో చాలా కీలకం. వారిలో చాలా మందికి కావాల్సింది దక్కడం లేదు. ప్రతి నలుగురిలో ఒకరికి ఉద్యోగం లేదు. చదువుకున్నోళ్లలో 42 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు” అని అన్నారు. దేశంలో 3.30 కోట్ల మంది క్రిస్టియన్లుండగా.. కేంద్ర మంత్రి వర్గంలో ఒక్కరే క్రిస్టియన్ మంత్రి ఉన్నారని చెప్పారు.

మైనారిటీలపై దాడులు పెరిగినయ్

దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని చిదంబరం ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యం మాయమయ్యే స్థితికి చేరుకుంటున్నది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద ప్రమాదాల్లో ఇదీ ఒకటి. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలపై దాడులు పెరిగాయి. అడుగడుగునా వివక్ష చూపుతున్నారు. మైనారిటీలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. 2017 నుంచి 2021 వరకు 2,900 మత ఘర్షణల ఘటనలు జరిగాయి. మైనారిటీ ఎన్జీవోలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్టరైన స్వచ్ఛంద సంస్థలను వేలాదిగా రద్దు చేసింది. విదేశాల నుంచి నిధులు తీసుకుంటున్న స్వచ్ఛంద సంస్థలను కాంగ్రెస్​ ప్రభుత్వం ఏనాడూ అడ్డుకోలేదు” అని చెప్పారు. ఐదేండ్లలో కేంద్రం 6,622 క్రిస్టియన్ ఎన్జీవోలను రద్దు చేయగా.. అందులో 622 తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. ఎల్గార్ పరిషద్ కేసులో ఫాదర్​ స్టాన్ స్వామిని కేంద్రం జైలులో పెట్టిందని, అనారోగ్యం ఉన్నా విడుదల చేయలేదని ఆరోపించారు. దీంతో ఆయన జైలులోనే చనిపోయారని చెప్పారు. న్యాయవ్యవస్థ ఎంతలా భ్రష్టుపట్టిందో ఈ ఒక్క ఘటనే తెలియజేస్తున్నదని పేర్కొన్నారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. 

సోనియా గాంధీని విమర్శించే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని పీసీసీ చీఫ్ రేవంత్​ రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ నెల ఒక అద్భుతమని, 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చిందని, 2023 డిసెంబర్‌‌‌‌లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేయాలి. కానీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి దేశంలో దాపురించింది. దేశంలో మైనార్టీలు భయం భయంగా బతుకుతున్నారు. దేశ ప్రజల ఆత్మరక్షణ కోసం దేశమంతటా రాహుల్ పాదయాత్ర చేశారు. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే క్రిస్టియన్ మైనారిటీల డిమాండ్లు తీరుతాయి’’ అని అన్నారు.

హంగ్ వచ్చేలా బీజేపీ కుట్ర: రేవంత్

రాష్ట్రంలో హంగ్‌‌ వచ్చేలా బీజేపీ కుట్ర చేస్తున్నదని రేవంత్‌‌ రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రంలో హంగ్ వస్తుందని బీఎల్ సంతోష్ చెప్తున్నారు. ఎలాగూ కాంగ్రెస్, బీజేపీ కలవవని అందరికీ తెలుసు. హంగ్‌‌ వస్తే కలిసేది బీజేపీ, బీఆర్ఎస్ మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్లు చీల్చి, హంగ్ వచ్చేలా బీజేపీ కుట్ర చేస్తున్నది. కర్నాటకలో హంగ్ వస్తే జేడీఎస్‌‌తో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నట్టే.. ఇక్కడా బీఆర్ఎస్​తో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ఈ కుట్ర భగ్నం చేయండి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నాటక ప్రజల్లానే మైనారిటీలు, క్రిస్టియన్లు కాంగ్రెస్‌‌కు అండగా ఉండాలని కోరారు. కర్నాటకలో మైనారిటీల సంక్షేమం కోరే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. అపూర్వ సోదరులైన మోదీ, కేసీఆర్‌‌‌‌లకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటులో చిదంబరంది ప్రత్యేక పాత్ర అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. క్రిస్టియన్ల న్యాయమైన అన్ని డిమాండ్లను తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో ప్రతి నిరుపేదనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.