గండిపేట భూకబ్జా కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు సైబరాబాద్ పోలీసులు. నిన్న తమిళనాడులోని కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం ఉదయం మొదట సైబరాబాద్ కమిషనరేట్ లోని ఈవోడబ్ల్యూ ఆఫీసుకు తరలించారు. అనంతరం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. స్టేట్ మెంట్ రికార్డు చేసిన అనంతరం బ్రహ్మనాయుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. బ్రహ్మనాయుడి అరెస్ట్ తో గడ్చిబౌలి సీపీ ఆఫీసుకు భారీగా వినుకొండ వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.
బ్రహ్మనాయుడి అరెస్ట్ తో మొత్తం అరెస్ట్లు ఆరు సంఖ్య ఆరుకు చేరింది. బ్రహ్మనాయుడిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారన్న సమాచారంతో వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్తలు పీఎస్ కు వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
గండిపేట సర్వే నంబర్ 18 భూకబ్జా డిటెయిల్స్..
గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారు. ఈ భూమిని కోర్టు తమకే కేటాయించినట్లు తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు.
ఆ భూమిని కొనుగోలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేష్‌లతో నిందితులు ఒప్పందం చేసుకున్నారు. దీనిపై గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కుట్రలో ఇప్పటికే నిమ్మల రాజేశ్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. బ్రహ్మనాయుడి సోదరుడు రమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
12 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు
ఈ భూకుంభకోణంలో రూ.12 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో నిమ్మల కుటుంబ సభ్యులకు రూ.4 కోట్లు, రాధాకృష్ణకు రూ. 4 కోట్లు, మిగిలిన వారికి మరో రూ. 4 కోట్లు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.
కేసు తీవ్రతను పరిశీలించిన హైకోర్టు.. బ్రహ్మనాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటీవలే తిరస్కరించింది. దాంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని కాంచిపురంలో పట్టుకున్నారు.
