అమ్మకానికి గ్లాండ్​ ఫార్మా ?

అమ్మకానికి గ్లాండ్​ ఫార్మా ?

ముంబై: గ్లాండ్​ ఫార్మాలో తన వాటాను అమ్మాలని ఫోసన్​ ఫార్మాస్యూటికల్​ కంపెనీ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుకు ఆసక్తి ఉన్న కొంత మంది ముందుకు రావడంతో ఈ ప్రపోజల్​ను చైనా కంపెనీ పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గ్లాండ్ ఫార్మాలో ఫోసన్​ ఫార్మాస్యూటికల్స్​కు కంట్రోలింగ్​ వాటా ఉంది. ఈ వార్త బయటకు రావడంతో గ్లాండ్ ఫార్మా షేర్లు 5.7 శాతం ఎగిశాయి. ఈ కంపెనీ షేర్లు ఇంతలా పెరగడం నెల రోజులలో  ఇదే మొదటిసారి. గ్లాండ్ ఫార్మా షేర్లు ఈ ఏడాది 53 శాతం దాకా పతనమయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ వాల్యూ 3.6 బిలియన్​ డాలర్లకు తగ్గిపోయింది.

గ్లాండ్ ఫార్మాలో వాటా అమ్మకపు వార్తల నేపథ్యంలో హాంకాంగ్​ ఎక్స్చేంజ్​లో ఫోసన్​ ఫార్మా షేర్లు 5.4 శాతం లాభపడ్డాయి. హైదరాబాద్​ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ పార్మా ఇంజెక్టబుల్స్​డ్రగ్స్​ తయారీలో ఉంది. యాంటి బయాటిక్స్​, ఆంకాలజీ, కార్డియాలజీ డ్రగ్స్​ను 60 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఫోసన్​ ఫార్మా 2017 లో గ్లాండ్​ ఫార్మాలో 74 శాతం వాటాను 1.1 బిలియన్​ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు గ్లాండ్​ ఫార్మాను  పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లింది. ​