తాలిబన్ల నుంచి రక్షణ కోసం అమ్మాయిల స్కూల్‌ రికార్డ్స్‌కు నిప్పు

తాలిబన్ల నుంచి రక్షణ కోసం అమ్మాయిల స్కూల్‌ రికార్డ్స్‌కు నిప్పు

అఫ్గాన్‌ తాలిబన్ల చెరలోకి వెళ్లాక ఆ దేశంలో ప్రజల పరిస్థితి అత్యంత దీనంగా మారింది. జనాలు, ముఖ్యంగా ఆడవాళ్లు భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గతంలో 90ల్లో అఫ్గాన్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించిన తాలిబన్లు.. ఆ సమయంలో ఆడపిల్లల చదువులపై నిషేధం పెట్టారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం, బానిసలుగా మార్చుకోవడం, వాళ్ల మాటను కాదని బయట అడుగుపెడితే కాల్చి చంపేయడం లాంటి దురాగతాలకు పాల్పడ్డారు. నాటి పీడకలలను ఇంకా మర్చిపోని అఫ్గాన్ ప్రజలు ఇప్పుడు మళ్లీ తాలిబన్ రాజ్యం రావడంతో దేశం వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఉన్న వాళ్లు తమ మానప్రాణాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. 

2002లో తాలిబన్‌ పెత్తనం నశించి, పౌర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక చోట్ల మళ్లీ ఆడ పిల్లల చదువుపై దృష్టి పెట్టారు. ప్రభుత్వంతో పాటు కొన్ని ఎన్జీవోలు ఆడ పిల్లలకు ప్రత్యేక స్కూల్స్ ప్రారంభించి చదువులు చెబుతూ వస్తున్నారు. అయితే మళ్లీ అఫ్గాన్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు ఆ దేశంలో ఆడపిల్లల స్వేచ్ఛపై రక్కసి దాడులకు దిగుతారన్న భయం పట్టుకుంది. దీంతో ఓన్లీ ఆల్ గాల్స్‌ బోర్డింగ్ స్కూల్స్ స్థాపించిన షబానా బసీజ్ రసిఖ్‌.. తన స్కూల్‌లో చదివి, ప్రస్తుతం చదువుకుంటున్న అందరి రికార్డులను తగలబెట్టేశారు. ఈ విషయాన్నే ఆమె స్వయం తన ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. తన దగ్గర చదువుకున్న ఆడపిల్లల స్కూల్ రికార్డులు తగులబెడుతున్నానని, తాలిబన్ల నుంచి ఆ పిల్లలు, వాళ్ల కుటుంబాలను రక్షించేందుకే ఈ పని చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్కూల్‌లో రికార్డులు తగులబెడుతున్న వీడియోను కూడా ఆమె పోస్ట్ చేశారు. ప్రస్తుతం తనతో పాటు కొలీగ్స్, తన స్టూడెంట్స్ అంతా క్షేమంగా ఉన్నారని, అయితే దేశంలో అన్ని స్కూళ్ల పరిస్థితి ఇలాగే లేదని, చాలా మంది ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని క్షణం క్షణం భయంగా గడుపుతున్నారని షబానా చెప్పారు. అడపిల్లలు బలంగా మంచి భవిష్యత్తును పొందేలా ఎదగడానికి చదువొక్కటే మార్గమని, కానీ ప్రస్తుతం పరిస్థితులు ముందు ప్రాణాలను కాపాడుకోవడమే ముఖ్యమన్నట్టుగా మారిపోయాయని అన్నారు. తాలిబన్ షరియా చట్టాల ప్రకారం ఆడపిల్లలు చదువుకోవడానికి లేదని, కేవలం మగవాళ్లు మాత్రమే చదుకోవాలని, అలాగే 12 ఏళ్లు పైబడిన తర్వాత ఆడవాళ్లు తమ ఫ్యామిలీకి సంబంధం లేని మంగవాళ్లతో మాట్లాడకూడదని, వీటిని ఉల్లంఘిస్తే తాలిబన్లు చంపేస్తారని అన్నారు.