సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయిని తరలిస్తున్ననలుగురు అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయిని తరలిస్తున్ననలుగురు అరెస్ట్
  • రూ.76 లక్షల విలువైన 380 కిలోల సరుకు స్వాధీనం

సికింద్రాబాద్, వెలుగు: వైజాగ్ నుంచి ఢిల్లీకి సికింద్రాబాద్ మీదుగా రైలులో గంజాయిని తరలిస్తున్న నలుగురిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే డీఎస్పీ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఉండే విక్కీ ఈజీ మనీ కోసం గంజాయి సప్లయ్ మొదలుపెట్టాడు. అదే ప్రాంతానికి చెందిన సమున్ అహ్మద్ అలియాస్ త్యాగి(32), సంజీవ్ కుమార్(40), గౌరవ్ కుమార్(38), కర్తార్ సింగ్(31)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. సమున్ అహ్మద్ ఢిల్లీ నుంచి సిటీకి వచ్చి తిరుమలగిరిలో ఉంటున్నాడు. డ్రైవర్ గా పని చేస్తూ సిటీలో గంజాయి సప్లయర్ గా చేస్తున్నాడు. విక్కీ సూచనలతో సమున్ మరో ఇద్దరితో కలిసి వైజాగ్ కు వెళ్లి అక్కడి ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి కొని సిటీకి తీసుకొచ్చేవారు. దాన్ని సంజీవ్, కర్తార్, గౌరవ్ కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అందించేవాడు. ఆ ముగ్గురు రైలులో ఢిల్లీ, రాజస్థాన్ కు గంజాయిని తరలించి అక్కడ అమ్మేవారు. కొన్నిసార్లు సమున్ గంజాయిని  కారులో కూడా ఢిల్లీ, రాజస్థాన్ కు తరలించేవాడు. ఈ నెల 11న సమున్ వైజాగ్ నుంచి 114 కిలోల గంజాయిని సిటీకి తీసుకొచ్చాడు. దాన్ని 6 సూట్ కేసుల్లో పెట్టి  సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో కర్తార్ , గౌరవ్, సంజీవ్​కు అప్పగించాడు.

తర్వాత సమున్ తిరుమలగిరికి వెళ్లిపోయాడు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై ఢిల్లీ వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న గౌరవ్, సంజీవ్, కర్తార్ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరున్న సూట్ కేసులను తనిఖీ చేసి 114 కిలోల గంజాయిని గుర్తించారు. ముగ్గురిని విచారించి వివరాలు తెలుసుకున్నారు. తిరుమలగిరిలోని సమున్ అహ్మద్ ఇంటిపై దాడులు చేసి మరో 266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.76 లక్షల విలువైన 380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే డీఎస్పీ నర్సయ్య తెలిపారు. నలుగురు నిందితులను రిమాండ్​కు తరలించామన్నారు. ప్రధాన నిందితుడు విక్కీ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.