మెహిదీపట్నం, వెలుగు: ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులు, అమాయకులను మోసగించి డబ్బులు దొంగిలిస్తున్న నలుగురిని మెహదీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ శనివారం వెల్లడించారు. హర్యానాకు చెందిన అమీర్ సోహెల్, ముబారక్, మస్త క్రీమ్, యూపీకి చెందిన మహ్మద్ అమీర్ నలుగురు మిత్రులు. వీరు ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి కార్డు మార్చి డబ్బులు దొంగిలిస్తున్నారు.
గత నెల 28న మల్లేపల్లి ఎక్స్ రోడ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో ఒకరిని మోసం చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా శనివారం ఉదయం నలుగురిని పట్టుకొని విచారించగా, అసలు విషయం బయటపడింది. వీరి వద్ద 89 ఏటీఎం కార్డులు, రూ.52 వేల నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఏ1 అమీర్ సోహెల్పై గతంలో నగరంలో నాలుగు కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
