
- మొదటి దశలో 100 ట్రామాకేర్ సెంటర్లు
- 36 కిలోమీటర్లకో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
పరిగి/వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలో మొదటి దశలో 100 ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఒక్కో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.5.5 కోట్లు ఖర్చవుతున్నదని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏటా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలనే లక్ష్మంతో ముందుకెళ్తున్నాం. జిల్లా కేంద్రాల్లో మొబైల్క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. త్వరలో 4 రీజినల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం” అని వెల్లడించారు.
వికారాబాద్‌లో రూ.30 కోట్లతో నిర్మించిన 300 బెడ్ల ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. పరిగి ఆస్పత్రి అప్‌గ్రేడేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ.. పరిగి ఆస్పత్రిని 30 నుంచి 100 బెడ్లకు అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇందుకోసం రూ.27 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పరిగిలోని 5 బెడ్ల డయాలసిస్ సెంటర్‌ను 9 బెడ్లకు పెంచుతున్నామని చెప్పారు.
చౌడాపూర్ మండలంలో పీహెచ్‌సీ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి 36 కిలోమీటర్లకు ఒక ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వికారాబాద్ ఆస్పత్రికి ఎంఆర్ఐ స్కాన్సెంటర్ను మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. వికారాబాద్‌కు నూతనంగా ట్రామాకేర్ సెంటర్ మంజూరు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ కులాల మధ్య పంచాయితీ కాదని అన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కులగణన, వర్గీకరణ అవసరమన్నారు.
అధికారులతో సమీక్ష..
మెడికల్ ఎడ్యుకేషన్‌ను బలోపేతం చేయాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్‌కాలేజీల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ప్రైవేట్ అంబులెన్స్ మాఫియాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి, బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలని సూచించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కాలేజీ, హాస్టల్ కొనసాగుతున్న భవనాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు.