
వారంలో 4 రోజులే పని... ఇది వినడానికే ఎంత హాయిగా ఉందో కదా...? కానీ కొన్ని కంపెనీలు ఆ పద్ధతినే అమలుచేయాలని భావిస్తున్నాయట. అయితే అది మన ఇండియాలో కాదు...లండన్ లో. ఇప్పటికే వారంలో నాలుగు రోజుల పని విధానాన్ని యూకేలోని 61 కంపెనీలు జూన్ నుంచి డిసెంబర్ వరకు 6 నెలల పాటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించకుండా ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు రావడంతో సుమారు 56 కంపెనీలు అదే విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. మరో 18 కంపెనీలు మాత్రం వారానికి నాలుగు రోజుల పనిని శాశ్వతంగా కొనసాగించాలని నిశ్చయించుకున్నాయి. అయితే ఈ ట్రయల్ లో 61 కంపెనీలకు చెందిన 2900 మంది పాల్గొన్నారని బ్రిటన్‌కి చెందిన అటానమీ అనే సంస్థ వెల్లడించింది. అంతే కాదు నాలుగు రోజుల పని విధానాన్ని వల్ల ఉత్పాదకతలో ఎలాంటి తేడా లేదని ఆయా కంపెనీలు చెప్పడం విశేషం. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ చాలా వరకు మెరుగయ్యిందని ఆ సంస్థ తెలిపింది. ఈ విధానం వల్ల ఉద్యోగాలను వదిలిపెట్టే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధనలో వెల్లడైన మరో ఆసక్తికరమైన విషయం.