- ఎక్కువ కాలం కొనసాగని ఇన్ స్పెక్టర్లు
- గతేడాది జూన్ 2న కొత్తగా ఏర్పాటైన పీఎస్
జూబ్లీహిల్స్, వెలుగు : హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన బోరబండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఏ ఇన్ స్పెక్టర్ కూడా ఎక్కువ కాలం కొనసాగడంలేదు. స్టేషన్ ప్రారంభించిన 8 నెలల్లోనే నలుగురు ఇన్ స్పెక్టర్లు మారారు. ఇలా ట్రాన్స్ ఫర్ అవుతుండగా.. పోలీస్ స్టేషన్ కు ఏమైనా వాస్తు దోషం ఉందా..! అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
వెస్ట్ జోన్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు .. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సంజీవరెడ్డి నగర్ ఉండేవి. జనాభా పెరుగుదలతో పాటు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో 2023 జూన్ 2న కొత్తగా బోరబండ పీఎస్ ను ఏర్పాటు చేశారు. పీఎస్ తొలి ఇన్ స్పెక్టర్ గా కె. రవికుమార్ బాధ్యతలు చేపట్టగా.. అప్పటి సిటీ పోలీస్ కమిషనర్ స్టేషన్ ను సందర్శించి రౌడీ షీటర్ల ఇండ్లను చూపించాలని ఆదేశించారు.
దీంతో ఇన్ స్పెక్టర్ చూపించకపోగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడనే కారణంతో ఆయనను కమిషన రేట్ కు అటాచ్ చేశారు. రెండో ఇన్ స్పెక్టర్ గా ఎస్. విజయ్ వచ్చి కొద్దిరోజులకే మరో ప్రాంతాలకు బదిలీపై వెళ్లిపోయాడు. మూడో ఇన్ స్పెక్టర్ గా ఆదిరెడ్డి బాధ్యతలు తీసుకోగా.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల కిందట ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో వీర శేఖర్ చార్జ్ తీసుకోనున్నారు. పోలీస్ స్టేషన్ ఏర్పాటైనప్పటి నుంచి డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ భూపాల్ గౌడ్ మాత్రమే కంటిన్యూగా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్ స్పెక్టర్ల ట్రాన్స్ ఫర్ల వెనక ఫిర్యాదు దారుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనేది ప్రచారంలో ఉంది.
