సైఫాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో190ను తక్షణమే అమలు చేయాలని 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో ఇచ్చి10 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బాధిత ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు ఉపశమనంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 190 ను తీసుకొచ్చిందన్నారు.
ఈ జీవో వల్ల మూడేండ్ల పాటు స్థానిక జిల్లాలలో పోస్టింగ్‌లు పొందే సడలింపు ఇచ్చిందన్నారు. ఈ జీవోను విద్యాశాఖ మాత్రం అమలు చేయడం లేదని చెప్పారు. ఈ జీవో ఆధారంగా జూన్ 12 లోగా తమకు స్థానిక జిల్లాలలో పోస్టింగ్‌లు ఇవ్వాలని కోరారు. జేఏసీ అధ్యక్షుడు పాడకంటి అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఎలగొండ రత్నమాల, ట్రెజరర్ సూతరి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
