ఆ నియామకాలు చెల్లవ్.. విజయ్ సర్కారుకు మద్రాస్ హైకోర్టు షాక్

ఆ నియామకాలు చెల్లవ్.. విజయ్ సర్కారుకు మద్రాస్ హైకోర్టు షాక్

చెన్నై: కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి విజయ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుబట్టింది. బాధిత కుటుంబాల్లో ఒకరికి సీఎం విజయ్ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ నియామకాలు చెల్లవని, వాటిని రద్దు చేయాలని మద్రాస్ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు)ను ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది. 

ఈ తరహా ప్రత్యేక ఉద్యోగాల కేటాయింపులు ఇతరులు కూడా ఇలాగే ఉద్యోగాలు కోరేందుకు ఆస్కారం ఉంటుందని, అప్పుడు అరాచకం, అశాంతి రాజ్యమేలుతాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో విజయ్ టీవీకే పార్టీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో పిల్లలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, విజయ్​ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ నెల ప్రారంభంలో ఆయన కరూర్‎లో పర్యటించారు. 

తొక్కిసలాటలో మృతి చెందిన 32 మంది బాధితుల చట్టపరమైన వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేశారు. బాధితుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్ బీ ఉదయకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న సామాన్య కుటుంబాల యువత పొట్ట కొట్టడమే అవుతుందని, ఇది ద్రోహమని అభివర్ణించారు. 

ప్రామాణిక చట్టబద్ధమైన విధానాలను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాల కోసం తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం తప్పుడు విధానమని ఉదయకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తమిళనాడులో అన్ని ప్రభుత్వ నియామకాలు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే జరగాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు.. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవంటూ ఉత్తర్వులు జారీ చేసింది.