- డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ముందుకు: ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్.గిరిధర్
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడు టన్నుల గంజాయి పట్టుకున్నామని ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఆర్.గిరిధర్ తెలిపారు. గంజాయి సప్లై చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేస్తూ పక్క రాష్ట్రాల పోలీసుల సమన్వయంతో గంజాయి కట్టడిలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బార్డర్లలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
సోమవారం నిజామాబాద్‌లో పర్యటించిన ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో కలిసి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా పోలీసుల సహకారంతో కీలక ఆపరేషన్లు నిర్వహించి గంజాయి ట్రాన్స్‌పోర్ట్ చైన్ సిస్టంను దెబ్బతీశామన్నారు. ఈగల్ ఇంటెలిజెన్స్ టీమ్ ఏర్పాటు చేశామని.. గంజాయి, ఆల్ఫ్రాజోలం రవాణా పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం తదితరులు ఉన్నారు.
