- విద్యార్థులపై హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తారా?: రాహుల్ గాంధీ
- బిహార్‌లో విద్యార్థులపై పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టడంపై ఆగ్రహం
- ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- స్టూడెంట్లకు ప్రధాని మోదీ
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- జులై 25న జరిగిన ‘బిహార్ బంద్’ నిరసనల్లో విద్యార్థులపై ఏకే-47 రైఫిల్‌తో పోలీస్ కానిస్టేబుల్ కాల్పులు
- వీడియో వైరల్.. మండిపడ్డ ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్టూడెంట్లపై ఏకే 47తో కాల్పులు జరుపుతారా..? అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై బీజేపీ సర్కారు హింసాత్మక వైఖరి ప్రదర్శిస్తున్నదని అన్నారు. బిహార్‌లో నీట్ పేపర్ లీకేజీ, ఇతర సమస్యలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఏకే-47 తుపాకులు, బలప్రయోగానికి పాల్పడ్డారంటూ విరుచుకుపడ్డారు. విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరపడం దారుణమని, దాడి చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ సోమవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
‘‘విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవస్థ అంతా హంతక స్వభావంతో వ్యవహరిస్తోంది. బిహార్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే-47లతో కాల్పులు జరిపారని వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను నిర్బంధించి వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రధాని వాగ్దానాలు ఏమయ్యాయి..?
విద్యార్థులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబో మని, నిర్బంధించిన వారిని విడుదల చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఆ హామీకి విరుద్ధంగా స్టూడెంట్లపై పోలీసులు ప్రాణాంతక దాడులు, క్రూరత్వానికి ఒడిగడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు వాడారు. బిహార్‌లో ఏకే-47లు ప్రయోగించారు. యూపీ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఢిల్లీ... ఎక్కడ చూసినా ఇదే తరహా అణచివేత ధోరణి కనిపిస్తోంది” అని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రాథమికంగానే నిజాయితీ లేనిది అని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని అన్నారు. విద్యార్థుల గొంతు నొక్కేందుకు ఏ గారడీకైనా, కుట్రకైనా వెనుకాడబోదని ఫైర్ అయ్యారు.
అసలేం జరిగిందంటే..?
పేపర్ లీక్ వివాదం, విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా పలు విద్యార్థి సంఘాలు జులై 25న బిహార్‌లో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా సీవాన్‌తో సహా పలు జిల్లాల్లో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. అనేక చోట్ల విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నగరం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాంధీ మైదాన్ వైపు ర్యాలీగా బయలుదేరిన సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య మాటామాట పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విద్యార్థులపై ఓ కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించామని, నిబంధనల ఉల్లంఘనపై విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.
ముగ్గురికి గాయాలు..
ఈ కాల్పుల ఘటనలో గాయపడిన ముగ్గురు నిరసనకారులు ప్రస్తుతం పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. గాయపడిన వారిలో 15 ఏండ్ల బాలుడు కూడా ఉన్నాడు. బంద్ సందర్భంగా తన షాపు మూసివేసి ఇంటికి తిరిగి వస్తుండగా మెడ భాగంలో బుల్లెట్ తగిలిందని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.
శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించగా, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, దోషులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
