మోదీకి రాజకీయ దిగ్గజాల కొరత... యూత్ ఆందోళనలు బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తుందా?

మోదీకి రాజకీయ దిగ్గజాల కొరత... యూత్  ఆందోళనలు  బీజేపీ ప్రభుత్వాన్ని కూలుస్తుందా?

ఒక  ప్రభుత్వం  సమర్థవంతుడైన  నాయకత్వం  కారణంగా  ఎన్నికలలో  విజయం సాధించవచ్చు.  కానీ  ఆ ప్రభుత్వం తన మంత్రివర్గం ద్వారానే  దేశాన్ని పరిపాలిస్తుంది.  ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తన పాలన మూడో పర్యాయం  నడిమధ్యలోకి అడుగుపెడుతున్న తరుణంలో రాజకీయ వర్గాలలో  ఒక ప్రశ్న  తలెత్తుతోంది. 

 రోజురోజుకీ  సంక్లిష్టమవుతున్న రాజకీయ సమస్యలను పరిష్కరించడానికి ప్రధాని మోదీ మంత్రివర్గంలో తగినంతమంది రాజకీయ  దిగ్గజాలు ఉన్నారా?  పరిపాలనా సామర్థ్యం ముఖ్యమే.  కానీ  రాజకీయాలలో  అంతిమంగా చర్చలు జరిపి, ఎదురైన తీవ్ర సంక్షోభాలను  సామరస్యంగా  పరిష్కరించగల నాయకులు చాలా అవసరం. ప్రస్తుత  జెన్‌‌‌‌ జీ  ఉద్యమం మోదీ  ప్రభుత్వంపై  విజయం సాధించడం... నిద్రపోతున్న కేంద్రాన్ని  మేల్కొలిపింది అనడానికి ఒక ఉదాహరణ. 

ప్రధాని మోదీ  ప్రభుత్వానికి రాజకీయ దిగ్గజాలు ఎందుకు అవసరమో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ  వ్యవసాయ చట్టాలు.  2020  సెప్టెంబర్ 17న  పార్లమెంటులో  వ్యవసాయ  చట్టాలను ప్రవేశపెట్టి 2020 సెప్టెంబర్ 20 నాటికే వాటిని  ఆమోదింపజేసిన తీరుపై  రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  రైతులతో ఎలాంటి చర్చలు జరపకుండా వ్యవసాయ చట్టాలను  పార్లమెంటులో ఆమోదించడంతో  దేశవ్యాప్తంగా రైతులలో తీవ్ర  నిరసన వ్యక్తమైంది. అనంతర ఆ వ్యతిరేకత ఎంత తీవ్రంగా  మారిందంటే,  మోదీ రాజకీయంగా ఇబ్బందిపడి ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవలసి వచ్చింది. మరోవైపు పెరుగుతున్న ధరలు, అధిక జీఎస్టీ పన్నులు కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయి.  

2016లో  మోదీ  సారథ్యంలోని ఎన్డీఏ  ప్రభుత్వం జీఎస్టీ విధానం తెచ్చినప్పటినుంచి అధిక రేట్లు  ప్రజలను ఆర్థిక భారానికి  గురిచేశాయి. పదేపదే  డిమాండ్లు చేసినప్పటికీ  మోదీ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ రేటును తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించలేదు. అనంతరం 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికలలో అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలిన తర్వాతే  ప్రభుత్వం దిగివచ్చి  చర్యలు తీసుకుంది.  2025 సెప్టెంబర్‌‌‌‌లో  జీఎస్టీ  రేట్లను కొంతమేర  కేంద్రం తగ్గించింది.

రైతులలో కొనసాగుతున్న ఆర్థిక దుస్థితి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్‌‌‌‌లో జరిగిన ఒక కిసాన్ ర్యాలీలో..  భారతదేశ స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవం సందర్భంగా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అయితే,  ఈ వాగ్దానాన్ని నేటికీ  నెరవేర్చలేకపోయారు. ఈ  సమస్యలను  నేను  ప్రస్తావించడానికి కారణం, అవి భారతదేశ  జనాభాలో  ఒక పెద్ద  విభాగాన్ని ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో  మోదీ  ప్రభుత్వం జరిగిన నష్టంలో  కొంత భాగాన్ని  పూడ్చడానికి  ప్రయత్నించింది.

  ఒకవేళ  కేంద్ర కేబినెట్‌‌‌‌లో  ఉద్ధండులైన సీనియర్ రాజకీయ నాయకులు ఉండి ఉంటే.. వారు ఈ సమస్యలపై మోదీకి  సరైన  సలహా ఇచ్చి ఉండేవారు. సమస్యలు తీవ్రం అవకుండా అడ్డుకునేవారు. పాలనలో  రాజకీయ  అనుభవం ఎందుకు  అవసరం అంటే.. కేబినెట్‌‌‌‌లోని రాజకీయ దిగ్గజాలు సంక్షోభాలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించడానికి  ఏమిచేయాలో ప్రధానమంత్రికి చెప్పడానికి వెనుకాడరు.  పీవీ. నరసింహారావు,  రాజీవ్ గాంధీ,  డాక్టర్ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో అనేకమంది రాజకీయ దిగ్గజాలతోపాటు ప్రతీ కేబినెట్‌‌‌‌లో  కనీసం 16 మంది మాజీ ముఖ్యమంత్రులు ఉండేవారు.

వాజ్‌‌‌‌పేయి కేబినెట్‌‌‌‌లో దిగ్గజాలు

1999లో  అటల్  బిహారీ వాజ్‌‌‌‌పేయి కేబినెట్‌‌‌‌లో  కూడా దిగ్గజాలైన  సీనియర్ నాయకులు ఉండేవారు. ఎల్. కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్,  సుష్మా స్వరాజ్, జార్జ్ ఫెర్నాండెజ్, బిహార్‌‌‌‌కు చెందిన నితీశ్ కుమార్,  నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ,  మాజీ ముఖ్యమంత్రులు  సుందర్‌‌‌‌లాల్ పట్వా, శాంతా కుమార్, రాజ్‌‌‌‌నాథ్ సింగ్ వంటి దిగ్గజాలు ఉన్నారు. 

 ప్రస్తుతం మోదీ కేబినెట్‌‌‌‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  అమిత్ షా, రాజ్‌‌‌‌నాథ్ సింగ్,  జేపీ నడ్డా  ప్రధానంగా రాజకీయ సమస్యల పరిష్కర్తలుగా ఉన్నారు.  కానీ వారి సంఖ్య సరిపోదు.  కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక అనుభవజ్ఞుడైన మాజీ ముఖ్యమంత్రి. అయితే ఆయనకు కేంద్రంలోని ఇతర నాయకులతో పోల్చిచూస్తే జాతీయ రాజకీయ అనుభవం పరిమితంగా ఉంది. 

ప్రాంతీయంగా  కూడా  మోదీ  మంత్రివర్గంలో  దక్షిణ, తూర్పు భారతదేశానికి  ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. చాలామంది  మంత్రులు  రాజకీయ అధికారాన్ని చేపట్టగలిగినా...  క్షేత్రస్థాయిలో  సున్నితమైన  సమస్యలను  పరిష్కరించగల  ప్రజా రాజకీయ నాయకులుగా కాకుండా,  కేవలం పరిపాలనాధికారులుగా మాత్రమే ఉన్నారు.

చరిత్రను చూస్తే...

చరిత్రను బట్టి చూస్తే.. భారతదేశంలోని అత్యంత బలమైన ప్రభుత్వాలలో అధిక సంఖ్యలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉండేవారని తెలుస్తోంది.  రాజీవ్ గాంధీ,  అటల్ బిహారీ వాజ్‌‌‌‌పేయి,  పీవీ. నరసింహారావు,  డాక్టర్ మన్మోహన్ సింగ్  మంత్రివర్గాలలో  పరిపాలన,  ఎన్నికల రాజకీయాలు  రెండింటినీ  అర్థం చేసుకున్న అనేకమంది మాజీ  ముఖ్యమంత్రులతో  సహా ఎందరో  రాజకీయ దిగ్గజాలు ఉండేవారు. 

 నేటి రాజకీయ వాతావరణం మరింత క్లిష్టంగా ఉంది.  పార్లమెంటులో  అధికార,  ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి.  సోషల్ మీడియా కూడా  ప్రతి వివాదాన్ని పెద్దది  చేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో సమస్యలు పెద్ద సంక్షోభాలుగా మారకముందే జోక్యం చేసుకోగల రాజకీయ సమస్య పరిష్కర్తలు  ప్రభుత్వాలకు చాలా అవసరం.  

మోదీ  ప్రభుత్వానికి  పార్లమెంటు లోపల కూడా  బలమైన రాజకీయ  నిర్వహణ  అవసరం. పార్టీలకు అతీతంగా రాజకీయ గౌరవం ఉన్న మంత్రులు ఉన్నప్పుడే  ఇది  సాధ్యమవుతుంది.  అంతరాయాలు, విధానపరమైన దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తరచుగా  జరుగుతుండటం పార్లమెంటరీ వ్యవహారాలపై శ్రద్ధ అవసరమని సూచిస్తున్నాయి.

రాజకీయ దిగ్గజాలు మోదీకి అవసరం

కాంగ్రెస్ పార్టీ  దశాబ్దాలపాటు  భారతదేశాన్ని పాలించి,  ఎందరో  నిష్ణాతులైన  రాజకీయ నాయకులను అందించింది.  కాంగ్రెస్ సీనియార్టీ పాలనతో  పోలిస్తే  బీజేపీ  సాపేక్షంగా  కొత్తది,  అందువల్ల  ప్రధాని మోదీ,  బీజేపీ  ఇతర  అనుభవజ్ఞులైన  నాయకులను ప్రభుత్వంలో  చేరమని ఒప్పించాలి. వాస్తవానికి బీజేపీ ఇతర రాజకీయ పార్టీల నాయకులను చేర్చుకోవడానికి  ఎప్పుడూ  వెనుకాడలేదు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినవారిలో  కొందరు ఇప్పుడు  ముఖ్యమంత్రులుగా  కూడా ఉన్నారు.  

ప్రస్తుతం మోదీ కేబినెట్‌‌‌‌లో  ప్రధానమంత్రికి నిర్మోహమాటంగా  సలహాలిచ్చేవారు  కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు - అమిత్ షా, రాజ్‌‌‌‌నాథ్ సింగ్,  జేపీ. నడ్డా.  ప్రస్తుతం  రాజకీయ,  ఆర్థిక సవాళ్లను  ఎదుర్కొంటున్న  ప్రభుత్వానికి  ఇది  ఏమాత్రం  సరిపోదు. రాబోయే  రోజుల్లో  మోదీ  ప్రభుత్వం  జెన్‌‌‌‌ జీ సారథ్యంలోని యువజన  సంఘాలు,  ప్రతిపక్షాల నుంచి పెరుగుతున్న ఆందోళనలను  మరింతగా  ఎదుర్కోవలసి ఉంటుంది. 

యువజన ఆందోళన మోదీ ప్రభుత్వాన్ని  కుప్పకూల్చగలదని ఇప్పటికే  పరోక్షంగా బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  కేవలం  సమస్యలు ఎదురైనప్పుడే ప్రతిస్పందించే  స్థితిలో ఉండకూడదు.  ముందుచూపుతో  వ్యవహరించాలంటే మోదీకి  కేబినెట్‌‌‌‌లో  మరింత రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు అవసరం. ఈ నేపథ్యంలో త్వరితగతిన జరిగే  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం వేచిచూద్దాం. 

ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి?

వ్యవసాయ  చట్టాలు  లేదా  పన్నుల వల్ల పెరిగిన ధరల భారాన్ని తీసుకుంటే,  దిద్దుబాటు చర్యలు అవసరమని ప్రధానమంత్రి  మోదీకి  చెప్పడానికి ఏ సీనియర్ మంత్రిగానీ, రాజకీయ నాయకుడుగానీ ముందుకు వచ్చినట్లు కనిపించడం లేదు.  విస్తృత సంప్రదింపులు లేకుండా వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో హడావుడిగా ప్రవేశపెట్టకూడదని 2020 సెప్టెంబరులో ఆయనకు సలహా ఇచ్చే మంత్రి ఎవరూ లేరు.  

అలాగే,  అధిక జీఎస్టీ రేట్లు ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయని సమర్థవంతంగా వాదించగలవారు కూడా మంత్రివర్గంలో ఎవరూ లేరు.  చివరికి  భారీస్థాయిలో  రైతులు చేపట్టిన ఆందోళన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది.  అదేవిధంగా 2024 లోక్‌‌‌‌సభ ఎన్నికల నిరాశాజనక ఫలితాలు ఆర్థిక వ్యవస్థపై ప్రజల అసంతృప్తిని సూచించాయి.  కేబినెట్‌‌‌‌లో ఎక్కువ సంఖ్యలో అనుభవజ్ఞులైన రాజకీయ దిగ్గజాలు ఉండి ఉంటే, ఈ తప్పులలో కొన్నింటిని ముందుగానే  నివారించి ఉండవచ్చు. 

- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్​

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.