
ఛత్తీస్గఢ్లో వరదలు బీభత్సం సృష్టించాయి.గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు బలరాంపూర్ జిల్లాలో ఆనకట్ట కూలిపోయి భారీ వరదలు సంభవించాయి. బుధవారం (సెప్టెంబర్3) ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జలసమాధి అయ్యారు. మరో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
45యేళ్ల క్రితం కట్టిన పాత ఆనకట్ట బీటలు వారి కూలిపోవడంతో ధనేష్ పూర్ అనే గ్రామం మొత్తం నీటమునిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను గుర్తించి పోస్టుమార్టమ్ కు తరలించారు.
గత వారం ప్రారంభంలో ఛత్తీస్ గఢ్ లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి దంతెవాడ, సుక్మా, బీజాపూర్, బస్తర్ జిల్లాల్లోని పలుప్రాంతాలు నీట మునిగాయి. 2వేల మందికి పైగా నిరాశ్రయులు కావడంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.