రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వర్షాలు కురువనున్నాయని వెల్లడించింది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్‌‌లో సోమ, మంగళవారాల్లో ఆకాశం మబ్బులు పట్టడంతో పాటు మోస్తరు వర్షం కురవొచ్చని వెల్లడించింది. ఇక, ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌‌‌‌లో 4.3 సెంటీమీటర్లు, గుడి హత్నూర్‌‌‌‌లో 4.2, మంచిర్యాల జిల్లా వెల్గనూరులో 4.1, నిజామాబాద్ జిల్లా ఆలూరులో 3.4, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్​పూర్‌‌‌‌లో 3.3, నిర్మల్ జిల్లా బాసరలో 3.2, వికారాబాద్ జిల్లా తాండూరులో 3.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డ్​అయింది.