హైదరాబాద్ లో నాలుగు కొత్త పార్కులు !..శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో ఏర్పాటు

హైదరాబాద్ లో  నాలుగు కొత్త పార్కులు !..శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో ఏర్పాటు
  • రూ.30 కోట్ల అంచనాతో ప్లాన్
  • కేంద్రం నుంచి రూ.25 కోట్లు,  జీహెచ్ఎంసీ రూ.5 కోట్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  గ్రేటర్​లో కొత్తగా నాలుగు పార్కులను డెవలప్  చేసేందుకు బల్దియా ప్లాన్ చేస్తోంది. వీటిని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తం 56 ఎకరాల్లో రూ.30 కోట్ల అంచనాతో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్కుల ఏర్పాటుకు ఖాళీ ప్రదేశాలతో పాటు చెరువుల వద్ద ఉన్న బఫర్ జోన్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

 ముందు నాలుగు పార్కులను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి  ఆ తర్వాత మరిన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్(ఎస్ఎఎస్ సీఐ) నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకో వాలని కమిషనర్ కర్ణన్ నిర్ణయించినట్లు తెలిసింది. 

 నెలాఖరులోపు టెండర్లు

ఖైరతాబాద్ జోన్ లోని జూబ్లీహిల్స్ లో ఇప్పటికే రెండు చిన్న పార్కులున్నాయి. ఇవి ఉపయోగంలో లేవు. ఇందులో ఒక్కొక్క పార్కును 18 ఎకరాల చొప్పున డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక పార్కు రూ. 9 కోట్లు, మరో పార్కు రూ. 8.80 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. శేరిలింగంపల్లి జోన్ లోని నల్లగండ్లలోని హుడా లేఅవుట్ కాలనీలో 12 ఎకరాల్లో  రూ.7 కోట్ల అంచనాతో, సికింద్రాబాద్ జోన్ లో లోని ఇందిరాపార్కును ఆనుకుని 8 ఎకరాల్లో రూ. 5.50 కోట్ల అంచనాతో  పార్కును డెవలప్ చేసేందుకు అర్భన్ బయోడైవర్సిటీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

 ఇందు కోసం కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖ ఎస్ఎఎస్ సీఐ కింద ఇచ్చే  రూ. 25 కోట్లు, మరో రూ.5 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. వచ్చేనెలాఖరులోపు పార్కుల అభివృద్ధికి సంబంధించి టెండర్లను వేసి నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం.