ఈ సారైనా విచారణకు రండి.. కేజ్రీవాల్‌కి నాలుగోసారి ఈడీ సమన్లు

ఈ సారైనా విచారణకు రండి..  కేజ్రీవాల్‌కి నాలుగోసారి ఈడీ సమన్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  అధికారులు మరోసారి  నోటీసులు పంపించారు.  జనవరి 18న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఆయనకు  ఇలా ఈడీ నోటీసులు పంపించడం ఇది నాలుగోసారి. అయినప్పటికీ ఈడీ నోటీసులను కేజ్రీవాల్‌ అస్సలు లెక్క చేయడం లేదు.  ఈడీ పంపిన సమన్లు చట్టపరమైనవి కావని, కేవలం తనను అరెస్ట్‌ చేయడమే లక్ష్యంగా జారీ చేసినవి కేజ్రీవాల్‌ కొట్టిపారేశారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అనేక మంది పార్టీ నేతలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.   ఇక  ఈ కేసుకు సంబంధించి ఆప్ చీఫ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గతేడాది ఏప్రిల్‌లో తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఈడీ కేజ్రీవాల్‌కు మొదటి సమన్లు ​జారీ చేసినప్పటి నుండి ఆయన్ను అరెస్టు చేస్తుందన్న ఊహాగానాలు ఎక్కువైపోయాయి.  

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. మద్యం కుంభకోణంలో అవకతవకలు, అవినీతి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంటే..ఇందులో ఇమిడి ఉన్న మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు జరుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ కేసు తీవ్ర ప్రకంపనలు రేపింది.