
ది హండ్రెడ్ 2025 లీగ్ లో హాస్యాస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా క్రికెట్ గ్రౌండ్ లో కుక్కలు, పాములు, పావురాలు రావడం చూస్తాం. కానీ హండ్రెడ్ లీగ్ లో ఎవరూ ఊహించని విధంగా ఒక నక్క గ్రౌండ్ లోకి వచ్చి హల్ చల్ చేసింది. మంగళవారం (ఆగస్టు 6) ఐకానిక్ లార్డ్స్‌లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరిగిన జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ తమ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో, స్పిరిట్ పేసర్ డేనియల్ వొరాల్ ఇన్నింగ్స్ 9 వ బంతిని వేయడానికి ముందు అనూహ్యంగా నక్క గ్రౌండ్ లోకి దూసుకొచ్చింది.
చాలా సేపు ఆ నక్క గ్రౌండ్ లో తిరగడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దాదాపు గ్రౌండ్ మొత్తం వేగంగా తిరుగుతూ కాసేపు ప్రేక్షకులని నవ్వించింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా చప్పట్లను కొడుతూ ఈ ఉల్లాసమైన క్షణాన్ని ఎంజాయ్ చేశారు. లక్కీగా ఆ నక్క ఎక్కువగా ఆలస్యం చేయకుండా గ్రౌండ్ నుంచి త్వరగానే బయటకు వెళ్లడం విశేషం. ఈ వింత సంఘటన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ ఈ సంఘటనను క్రికెట్‌లో అత్యంత వినోదాత్మక సంఘటనగా అభివర్ణించారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి పోరే ఏకపక్షంగా ముగిసింది. లండన్ స్పిరిట్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లండన్ స్పిరిట్ 94 బంతుల్లో 80 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ ప్రారంభంలోనే కుప్పకూలింది. కీటన్ జెన్నింగ్స్, డేవిడ్ వార్నర్, విలియమ్సన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 21 పరుగులు చేసిన టర్నర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. రషీద్ ఖాన్, సామ్ కుర్రాన్ చెరో మూడు వికెట్లు పడగొట్టి ఆతిధ్య జట్టును చిత్తు చేశారు. లక్ష్య ఛేదనలో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 69 బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి గెలిచింది.
A FOX IN THE GROUND DURING THE HUNDRED...!!! 🤯 pic.twitter.com/L6v4Zb6hp8
— Johns. (@CricCrazyJohns) August 6, 2025