సిటీలో ఇన్నోవేషన్ సెంటర్​ను ప్రారంభించిన మాన్

సిటీలో ఇన్నోవేషన్ సెంటర్​ను ప్రారంభించిన మాన్

హైదరాబాద్, వెలుగు: ఫ్రాన్స్ కు చెందిన ఫ్రాగ్రన్స్, ఫ్లేవర్స్ తయారీ సంస్థ మాన్  హైదరాబాద్ లో మంగళవారం ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించింది. ఈ ల్యాబ్​లో టెక్నికల్ డైరెక్టర్స్, క్రియేటర్స్, ఫ్లేవరిస్ట్స్, అప్లికేషన్ టీమ్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ పనిచేస్తారు. భారతదేశం, ఏపీఏసీ రీజియన్లలో ఆహార, పానీయాల మార్కెట్ డిమాండ్ ను తీర్చేందుకు అవసరమైన ఫ్లేవర్ ప్రొఫైల్స్ ను ఇక్కడ డెవలప్​ చేస్తారు. ఈ సెంటర్​ కోసం 3 మిలియన్ యూరోలను పెట్టుబడి పెట్టామని సంస్థ తెలిపింది. ఈ సెంటర్ లోని ఇన్– హౌస్ కిచెన్ (కలినరీ), చెఫ్ ఇక్కడి కలినరీ ఫుడ్ అప్లికేషన్స్​ను పరిశీలిస్తారు.  ఈ నూతన ఫెసిలిటీని మాన్ గ్రూప్ ఆసియా పసిఫిక్ డైరెక్టర్ బె ర్నార్డ్ లేనౌడ్, మాన్ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దాస్ గుప్తాతో కలసి మాన్ గ్రూప్ చైర్మన్ జీన్ మాన్​ ప్రారంభించారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్ 13,901 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.

ఇక్కడ తీపి, పులుపు  విభాగాల్లో ఆహార పదార్థాలను డెవెలప్​ చేస్తారు. ఈ సందర్భంగా జీన్​ మానే మీడియాతో మాట్లాడుతూ ‘‘మాకు హైదరాబాద్​లోని దుండిగల్​లోనూ ప్లాంటు ఉంది. ఇక్కడ ఆహార పదార్థాలను ముఖ్యంగా బేకరీ ప్రొడక్టులను తయారు చేస్తాం. గుజరాత్​లోని దహెజ్​ ప్లాంటులో పానీయాలు తయారవుతాయి. ఏపీలోని తిరుపతి దగ్గర ఉన్న ప్లాంటును విస్తరిస్తాం. కేరళ, కర్ణాటకలోనూ మాకు ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాద్​ సెంటర్​లో 60 మంది పనిచేస్తారు. దేశంలో మాకు రెండు వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. మేం ఆరు వేలకుపైగా ప్రొడక్టులను తయారు చేస్తాం. మా ఆదాయంలో ఇండియా ఆపరేషన్స్​ వాటా ఎనిమిది శాతం వరకు ఉంది. మార్కెట్​ షేర్​ ఐదుశాతం వరకు ఉంది. ఇండియాలో ఫ్రాగ్నెన్స్​ఇండస్ట్రీ ఏటా ఎనిమిది శాతం వరకు గ్రోత్​ సాధిస్తోంది”అని ఆయన వివరించారు.