ఫ్రాన్స్‌లో కోటి దాటిన కరోనా కేసులు

ఫ్రాన్స్‌లో కోటి దాటిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా కొత్త  వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అమెరికాలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  అక్కడ ఒక్కరోజే 4 లక్షల 43 వేల మందికి కరోనా సోకింది. ఇందులో దాదాపు 80 శాతం మంది ఒమిక్రాన్ బాధితులేనని తెలుస్తోంది. ఫ్రాన్స్, బ్రిటన్ లో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఫ్రాన్స్‌లో గడిచిన 24 గంటల్లో 2,19,126 మందికి కరోనా సోకింది. ప్యాండెమిక్‌ మొదలైన నాటి నుంచి ఈ దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. ఇప్పటికే అమెరికా, ఇండియా, బ్రెజిల్, బ్రిటన్, రష్యా దేశాల్లో కరోనా కేసులు కోటి మార్క్‌ దాటాయి.

ఇక ఇంగ్లాండ్‌లో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోంది. ప్రతి 25 మందిలో ఒకరికి కరోనా సోకుతుందని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. లండన్‌లో 15 మందిలో ఒకరికి సోకుతోంది. ఇప్పటి వరకు కొత్తవేరియంట్‌ బారినపడి 716 మంది చనిపోయినట్లు యూకే అధికారులు ప్రకటించారు.

కాగా, భారత్‌లోనూ కొద్ది రోజులగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 27 వేల 553 కేసులు నమోదు కాగా.. 284 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో  9 వేల 249 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు లక్షా 22 వేల 801 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 15 వందల 25 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో 460 కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 351 కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో 136, తమిళనాడులో 117, కేరళలో 109, రాజస్థాన్‌లో 69 ఉన్నాయి. మొత్తం 23 రాష్ట్రాల్లో మహమ్మారి విస్తరించిందని వైద్యాధికారులు తెలిపారు.